కరీంనగర్‌రూరల్/గన్నేరువరం: రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన పూర్వప్రాథమిక విద్యకు స్పందన లభించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి మరికొన్ని పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. జిల్లాలో 58 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరు అయ్యాయి. కరీంనగర్ మండలంలో చెర్లభూత్కూర్, నగునూరు, దుర్శేడ్ ప్రాథమిక పాఠశాలలున్నాయి. గన్నేరువరం మండలంలో ఖాసీంపేట, మైలారం, గన్నేరువరం పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాల్లలో ఈ నెల12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మండల విధ్యాధికారులు తెలిపారు.
ఒక్కో పాఠశాలకు రూ.1.70లక్షలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేరడం లేదు. ఇంగ్లిష్ మీడియం లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రావడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరు సంవత్సరాలు నిండిన విద్యార్ధులను ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం కల్పించేవారు. ప్రస్తుతం నాలుగేళ్లు నిండిన చిన్నారుల కోసం యూకేజీ తరగతిని ప్రారంభించనున్నారు. దీంతో తల్లిదండ్రులకు ఆర్థికభారం తప్పుతుంది. పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించే పాఠశాలల్లో సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.1.70లక్షలు కేటాయించారు. తరగతి గదుల గోడలకు రంగులు, బొమ్మలకు రూ.50వేలు, బెంచీలు, ఇతర సామగ్రికి రూ.50వేలు, క్రీడాసామాగ్రికి రూ.50వేలు, స్టేషనరీ, యూనిఫామ్స్, బూట్లు, బెల్టులకు రూ.20వేల చొప్పున ఖర్చు చేస్తారు.


