● ఆరుగురు హనుమాన్ దీక్షపరులకు గాయాలు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లి గ్రామ శివారులో జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం కారు టైరు పేలి అదుపుతప్పి చెట్టును ఢీకొనగా కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు హనుమాన్ దీక్షపరులకు గాయాలయ్యాయి. భూపాల్‌పల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం అన్నారంకు చెందిన ఆరుగురు ఆంజనేయస్వామి దీక్షాపరులు కారులో కొండగట్టుకు వచ్చి దర్శనం చేసుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా తక్కళ్లపల్లి శివారులో కారు టైరు పేలి అదుపుతప్పి చెట్టును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్రగాయాలు కాగా, వెంటనే 108 సిబ్బంది వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈవిషయం తెలుసుకున్న మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.


