నిబంధనలకు గంతలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న గ్రానైట్ కట్టింగ్, పాలీషింగ్ యూనిట్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. కోట్లల్లో గ్రానైట్ వ్యాపారాలు చేస్తూ పంచాయతీలకు పంగనామాలు పెడుతున్న పరిశ్రమలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పలు పరిశ్రమలు పంచాయతీల అనుమతులు పొందకుండానే యథేచ్చగా అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నాయి.
కానరాని నిబంధనలు
కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటైన గ్రానైట్ కట్టింగ్, పాలీిషింగ్ పరిశ్రమలు ఏ ఒక్కటి కూడా నిబంధనలకు లోబడి కార్యకలాపాలు కొనసాగించడం లేదు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం టీఎస్ పాస్ నిబంధనలు విస్మరించడంతో పాటు గ్రామ పంచాయతీలకు నిర్మాణ ఫీజు, బెట్టర్‌మెంట్ చార్జ్, డెవలప్‌మెంట్ చార్జీలు చెల్లించకుండానే అనేక పరిశ్రమలు కొనసాగుతున్నాయి. పరిశ్రమ కోసం నిర్మించే షెడ్లు/ భవనాలకు పంచాయతీ నుంచి ప్లాన్ అప్రూవల్ పొందకుండానే అనేక పరిశ్రమలు నడుస్తున్నాయి. ఈ పరిశ్రమలకు బ్యాంక్ రుణాలు, విద్యుత్ కనెక్షన్‌లు ఎలా వచ్చాయన్న సందేహాలపై కొంతమంది పంచాయతీ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల పరిశ్రమ స్థాపించేటప్పుడు అందుకు సంబంధించిన పంచాయతీ అనుమతి లేకుండానే అనేక పరిశ్రమలు విద్యుత్ కనెక్షన్‌లు పొందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివాస ప్రాంతాలకు దూరంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన వార్షిక ట్రేడ్ లైసెన్స్ ఫీజు, ఇతర పన్నులు సకాలంలో చెల్లించాలి. కానీ అవేవీ పట్టనట్లు పరిశ్రమల యజమానులు వ్యవహరిస్తుండటంతో పంచాయతీలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాయి. గ్రానైట్ పరిశ్రమల ఆగడాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
‘పాడి’ క్యాంప్ ఆఫీస్‌పైకి కోడిగుడ్లు.. టమాటాలు
హుజూరాబాద్: పట్టణ శివారులోని కేసీ క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపైకి సోమవారం యూత్ కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. కడియం శ్రీహరికి తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, మండలాధ్యక్షుడు పంజాల అరవింద్ గౌడ్, టేకుల శ్రావణ్, బండ నవీన్, శనిగరపు తరుణ్ పాల్గొన్నారు.


