విలీన.. నగర పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

విలీన.. నగర పంచాయితీ

Mar 31 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:38 AM

● రూ.50 కోట్ల టెండర్లపై పీటముడి ● పాత పనుల స్థానంలో కొత్త ప్రతిపాదనలు ● అడ్డూ అదుపు లేని అక్రమ నిర్మాణాలు ● రూ.312.42 కోట్లతో వార్షిక బడ్జెట్‌ ● నేడు బల్దియా బడ్జెట్‌, కౌన్సిల్‌ సమావేశం

● రూ.50 కోట్ల టెండర్లపై పీటముడి ● పాత పనుల స్థానంలో కొత్త ప్రతిపాదనలు ● అడ్డూ అదుపు లేని అక్రమ నిర్మాణాలు ● రూ.312.42 కోట్లతో వార్షిక బడ్జెట్‌ ● నేడు బల్దియా బడ్జెట్‌, కౌన్సిల్‌ సమావేశం

కరీంనగర్‌ కార్పొరేషన్‌ : నగరపాలక సంస్థ నూతన పాలకవర్గంలో విలీన.. నగర.. పంచాయితీ ముదురుతోంది. రూ.50 కోట్లతో చేపట్టిన 87 పనుల టెండర్‌ను రద్దు చేయడంపై విలీన డివిజన్ల కార్పొరేటర్లు, నగర కార్పొరేటర్ల నడుమ పంచాయితీ మొదలైంది. నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కుక్కలు, కోతుల సమస్యలు నగరవాసులకు తీవ్రమవుతున్నాయి. నగరపాలకసంస్థ పాలకవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం తొలిసారి మంగళవారం కౌన్సిల్‌ భేటీ అవుతోంది. ఉదయం బడ్జెట్‌ సమావేశం, మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధ్యక్షతన జరగనుంది.

రూ.50 కోట్లపై పీఠముడి

ఎన్నికలకు ముందు నగరానికి మంజూరైన రూ.50 కోట్ల నిధులపై రగడ కొనసాగుతోంది. విలీన ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ నగరంలో పెట్టిన 87 పనులను రద్దు చేయడం, కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై కార్పొరేటర్లు రెండుగా విడిపోయారు. కొన్ని డివిజన్లకే పరిమితమైన పనులను రద్దు చేసి, నగరంలోని 66 డివిజన్లకు కేటాయించాలని మెజార్టీ కార్పొరేటర్లు నిర్ణయించారు. 87 పనుల్లో ఐదారు మినహా, మిగతా పనులు విలీన డివిజన్లకు కేటాయించినవే. వీటికి టెండర్‌ ప్రక్రియ పూర్తయినప్పటికీ, పాలకవర్గం వచ్చాక రద్దు చేశారు. కొత్త కార్పొరేటర్ల ప్రతిపాదనల మేరకు విలీన ప్రాంతాలతో పాటు, నగరంలోని అన్ని డివిజన్లలో పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఇప్పటికే డివిజన్లవారీగా ఆయా కార్పొరేటర్ల నుంచి కొత్త పనుల ప్రతిపాదనలు తీసుకున్నట్లు సమాచారం. ఈ కొత్త పనుల ప్రతిపాదనలను మంగళవారం నాటి సమావేశంలో ఆమోదింపచేసేందుకు రంగం సిద్ధమైంది. పాత పనులు రద్దు చేయడం వల్ల తాము నష్టపోతామని విలీన డివిజన్ల కార్పొరేటర్లు అంటున్నారు. రూ.50 కోట్లతో 87 పనులకు పరిపాలనామంజూరు ఇ స్తూ సీడీఎంఏ జీఓ ఇచ్చినందున, పాత పనుల రద్దు చేసి కొత్త పనులు పెట్టడం అంత సులువు కాదని మరికొంతమంది వాదిస్తున్నారు. ఏదేమైనా రూ.50 కోట్ల టెండర్ల రద్దు పీఠముడి వీడేదెలాగ అనే ఆసక్తి నగరంలో నెలకొంది.

అక్రమ నిర్మాణాలకు అడ్డేది

నగరంలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది. పట్టణ ప్రణాళిక అధికారుల కుమ్మక్కు కారణంగానే ఈ అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని పలువురు కార్పొరేటర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అక్ర మ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నా, అధికారులు చర్యలుతీసుకోవడం లేదంటున్నారు. అక్రమ నిర్మాణాల కారణంగా నగరపాలకసంస్థ లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోతుందంటున్నారు.

కుక్కలు..కోతులు

నగరంలో కుక్కలు, కోతుల బెడద రోజురోజుకు తీవ్రమవుతోంది. నగరవ్యాప్తంగా అన్ని కాలనీలు ఈ సమస్యను ఎదుర్కొంటుంటండడం గమనార్హం. కుక్కలు, కోతులు గుంపులుగా తిరుగుతూ దాడులు చేస్తుండడం వల్ల ప్రజలు గాయపడుతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. కోతులను పట్టే కార్యక్రమాన్ని ఏజెన్సీకి అప్పగించి, చేపడుతున్నప్పటికి వేగవంతం చేయాల్సి ఉంది. ఇక కుక్కల బెడద మాత్రం నివారించలేని పరిస్థితిగా మారింది.

లైట్లు లేక చీకట్లు...తాగునీటికి ఇక్కట్లు

నగరంలో వీధిదీపాల సమస్య అధికంగా ఉంది. నగరంలోని ప్రధాన రహదారులతో పాటు, కాలనీల్లో వీధిదీపాలు వెలగడం లేదు. స్మార్ట్‌ స్ట్రీట్‌లైట్లు ఉన్న ప్రాంతాలు కూడా చీకటి మయంగా ఉంటున్నాయి. వేసవిలో తాగునీటి సమస్యలు పలు కాలనీలను వెంటాడుతున్నాయి. ప్రతిరోజు తా గునీటి సరఫరా నుంచి ఇప్పటికే రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతోంది. చాలా కాలనీల్లో ఫ్రెషర్‌ లేక, లీకేజీల కారణంగా తాగునీటి సమస్య ముదురుతోంది.

రూ.312.42 కోట్ల బడ్జెట్‌

నగరపాలకసంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.312.42 కోట్ల అంచనాలతో బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే బడ్జెట్‌లు ప్రవేశపెట్టడం, అందులో ప్రత్యేకంగా నగరాలకు నిధులు కేటాయించనప్పటికి, నిధులు వస్తాయని బ డ్జెట్‌లో రూపొందించడం చర్చనీయాంశంగా మారింది. ఏ లెక్కన ఆ నిధులు వస్తాయని అధికారులు అంచనా వేసారో కార్పొరేటర్లు పెదవివిరుస్తున్నారు. కాగా ఉదయం 11 గంటలకు నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో బడ్జెట్‌ సమావేశం, మధ్యాహ్నం 2 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశం మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధ్యక్షతన జరగనుంది. సమావేశంలో 11 ఏజెండా అంశాలు రూపొందించగా, టేబుల్‌ ఏజెండాగా మరికొన్ని అంశాలు కౌన్సిల్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement