కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ ట్యాక్స్‌లకు వాళ్లు అతీతులు. రూ.లక్షల్లో బకాయి పడ్డా వాళ్లపై కనీస చర్య ఉండదు. కొంతమంది ప్రభుత్వ ఉత్తర్వుల పేరిట, మరికొందరు తమకున్న పలుకుబడితో ఏళ్లుగా ట్యాక్స్ ఎగవేస్తూ వస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపులో డిమాండ్‌కు తగిన వసూళ్లు రాబట్టలేక నోటీసులు ఇచ్చి అధికారులు మమ అనిపిస్తున్నా రు. షరామామూలుగానే మరో ఆర్థిక సంవత్సరాన్ని మొండి బకాయి వసూళ్లు లేకుండానే దాటేస్తున్నారు.
రూ.లక్షల్లో బకాయిలు
ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడు రోజులే గడువు ఉంది. నగరపాలకసంస్థ అధికారులు పన్ను వసూళ్లను వేగవంతంచేశారు. మొండి బకాయిదారులపై దృష్టి సారించా రు. ఈ మొండి బకాయిదారుల్లో పెద్దలు అధికంగా ఉండడంతో రాజకీయ, అధికారిక ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనే వి మర్శలున్నాయి. అందులోనూ ప్రభుత్వశాఖలకు సంబంధించిన బకాయిలే అధికంగా ఉండడం గమనార్హం. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ అసోసియేషన్ రూ.75 లక్షల బకాయిలకు గాను అధికారుల ఒత్తిడితో ఇటీవల రూ.5లక్షల చెక్కు ఇచ్చినట్లు సమాచారం. గతేడాది బకాయిలు చెల్లించకపోతే, నగరపాలక సంస్థ సిబ్బంది సముదాయంలోని దుకాణాలకు తాళం వేశారు. దీంతో కిరాయిదారులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కిరాయిదారుల నుంచి ప్రతి నెలా అద్దె వసూలు చేస్తున్నా, ఆస్తి పన్ను కట్టకపోవడం అప్పట్లోనే వివాదాస్పదమైంది. లక్షల రూపాయలు ఎవరి ఖాతాలోకి పోతున్నాయంటూ ఆరోపణలు వినవచ్చాయి. ఈ ఏడాది అదే పరిస్థితి ఏర్పడింది. రూ.70 లక్షలు చెల్లించకపోతే దుకాణాలకు తాళంవేసేందుకు బల్దియా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక ప్రైవేట్ వ్యక్తుల్లోనూ లక్షల రూపాయల పన్నుల నుంచి అనధికారికంగా మినహాయింపు పొందుతున్న వాళ్లు పదుల సంఖ్యల్లో ఉన్నారు. కాపువాడకు చెందిన లక్ష్మి రూ.21,92,735, అలుగునూరుకు చెందిన సంతోష్ రూ.16,73,580, రాంనగర్‌కు చెందిన లలిత రూ.13,69,696, గాంధీరోడ్‌లోని పద్మ పేరిట రూ.13,30,955, వావిలాలపల్లిలోని విపంచి చిట్‌ఫండ్ సంస్థ రూ.10,31,866 బకాయి చెల్లించాల్సి ఉంది.
టీఎన్‌జీవోకు మినహాయింపుపై పెండింగ్
నగరంలోని టీఎన్‌జీవో సముదాయం రూ.28,94,450 చెల్లించాల్సి ఉండగా.. సొసైటీ కావడంతో 1991లోనే ఇ లాంటి భవనాలకు ట్యాక్స్ మినహాయింపు ఉందని టీఎన్‌జీవో నేతలు జీవో చూపుతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మున్సి పల్ చట్టంలో వచ్చిన మార్పులతో మినహాయింపు నుంచి సొసైటీలను తొలగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై టీఎన్‌జీవో రాష్ట్ర నేతలు అప్పీల్ చేసుకోగా, ప్రస్తుతం సీఎంవోలో పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నా రు. పన్ను మినహా యింపు కొనసాగించాలని టీఎన్‌జీవో నేతల అర్జీని అంగీకరించినట్లు కాని తిరస్కరించినట్లు ప్రభుత్వం తేల్చకపోవడంతోనే పన్ను చెల్లించ డం లేదంటున్నారు. ఏదేమైనా వేల రూ పాయలు బకాయి పడ్డ సామాన్యుల ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న నగరపాలకసంస్థ అధికారులు, రూ.లక్షలు బకాయి పడుతున్న పెద్దల జోలికి వెళ్లడంలేదనే అపవా దును మూట కట్టుకుంటున్నారు.


