మట్టికి మేలు తలపెట్టవోయ్‌ | - | Sakshi
Sakshi News home page

మట్టికి మేలు తలపెట్టవోయ్‌

Mar 28 2026 7:49 AM | Updated on Mar 28 2026 7:49 AM

● ప్రతి రెవెన్యూ పరిధిలో 10 శాంపిళ్ల సేకరణ ● భూసార పరీక్షలతో భారీగా తగ్గనున్న పెట్టుబడి ● రైతన్నా మారాలి.. నూతన ఒరవడి కావాలి

సద్వినియోగం చేసుకోవాలి

● ప్రతి రెవెన్యూ పరిధిలో 10 శాంపిళ్ల సేకరణ ● భూసార పరీక్షలతో భారీగా తగ్గనున్న పెట్టుబడి ● రైతన్నా మారాలి.. నూతన ఒరవడి కావాలి

కరీంనగర్‌ అర్బన్‌: ‘పుండొక చోటైతే మందొక చోట రాసినట్లు’ కాకుండా భూ‘సార’మెరిగి సాగడమే ఉత్తమం. భూసార పరీక్షలతో సాగు నేలలో ఏ ఏ లోపముందో స్పష్టమవనుండగా తదనుగుణ ఎరువులు వేసుకుంటే సరి. పెట్టుబడి గణనీయంగా తగ్గనుండగా దిగుబడి పెరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న భూసార పరీక్షలను సద్వినియోగం చేసుకుంటే సరి. జిల్లావ్యాప్తంగా ప్రతీ రెవెన్యూ గ్రామంలో 10 మట్టి నమూనాలను తీయనుండగా మే 10లోపు ఫలితాలను రైతులకు అందజేయనున్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుండగా ప్రభుత్వం తదనుగుణ చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించింది. జిల్లాలో 3.34లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగవుతున్నాయి.

యాప్‌లో వివరాల నమోదు

భూసార ప్రాధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. ప్రతి రైతు భూమికి సంబంధించి భూసారాన్ని పరీక్షించి ఫలితం వెల్లడించాలని యోచిస్తున్నాయి. ఒక్కో రెవెన్యూ గ్రామంలో పది నమూనాలు సేకరించాలని లక్ష్యం నిర్దేశించినా కనీసం ఐదు నమూనాలను అధికారులు తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది. క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) సేకరించి న నమూనాలు, సర్వే నంబర్లు, గ్రామం, రైతు పేరు, పంటలతో ప్రత్యేకంగా రూపొందించిన యా ప్‌లో వివరాలు నమోదు చేయాలి. ఏ జిల్లాకు చెందిన మట్టి నమూనాలను అదే జిల్లాలోని ప్రయోగశాలల్లో పరీక్షించాలని సూచించింది. సేకరించిన మట్టి నమూనాలను ఏప్రిల్‌ 15 లోగా పరీక్షించి వా టి ఫలితాలను అంతర్జాలంలో నిక్షిప్తపరచాలి. మే 4 నుంచి 10లోగా భూసార పరీక్షల కార్డులు రైతులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

పంపిణీకి కార్డులు సిద్ధం

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద పలు మండలాలను ఎంపిక చేసి భూసార పరీక్షలు నిర్వహించారు. కరీంనగర్‌ జిల్లాలో గన్నేరువరం మండలంలో 6వేల మట్టి నమూనాలను సేకరించి పరీక్షించారు. పెద్దపల్లి జిల్లాలో కమాన్‌పూర్‌ మండలంలో 4వేలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలంలో 4వేలు, జగిత్యాల జిల్లాలో ధర్మపురి మండలంలో 6వేల మట్టి నమూనాలు సేకరించి పరీక్షించగా ఫలితాలు వచ్చాయి. కరీంనగర్‌ భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షించగా ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఏప్రిల్‌ 2న సదరు భూసార కార్డులను అందజేయనున్నారు.

సూక్ష్మ ధాతువులే కీలకం

పంట విత్తిన నుంచి అవి మొలకెత్తడం, పైరు ఎదుగుదల, కాత, నాణ్యతతో కూడిన దిగుబడి, సూక్ష్మ ధాతువులపైనే ఆధారపడి ఉంటుంది. భూసార పరీక్షలో ఇవి తేలనున్నాయి. జింకు లోపిస్తే మొక్కల ఎదుగుదల సరిగా ఉండదు. మెగ్నీషియం తక్కువుంటే పత్రహరితం తయారవదు. అలాగే ఐరన్‌ లోపముంటే ఆకులు త్వరితగతిన ఎండిపోతుంటాయి. బోరాన్‌ లేకపోతే పంట ఏపుగా ఎదిగినా కాయలు పరిపక్వత లేక నిస్సారంగా ఉంటాయి. అపరాలు పండించాలనుకునే వారికి భూమిలో సల్ఫర్‌ అవసరం. సల్ఫర్‌ ఉంటేనే నూనె తయారయ్యే పరిస్థితి ఉంటుంది.

16 రకాల పోషకాలు అవసరం

మొక్క ఎదగడానికి 16రకాల పోషకాలు అవసరం. జింకు, బోరాన్‌, ఐరన్‌, మాంగనీస్‌, ఫాస్పరస్‌, పొటాషియం, నైట్రోజన్‌, కాల్షియం, కాపర్‌, సల్ఫర్‌, మెగ్నీషియం, మాలిబ్యూడినం, క్లోరిన్‌, కార్బన్‌, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ అవసరం. సేంద్రియ విధానం నుంచి రసాయనిక ఎరువుల వినియోగం పెంచుతూ వస్తుండటంతో గత 15ఏళ్లలో గణనీయమైన ప్రతికూల మార్పులు సంభవించాయి. రైతులు అధిక దిగుబడులు ఆఽశించి ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల నేల కాలుష్యం, నీటి కాలుష్యాలు పెరుగుతున్నాయి. కొంత కాలానికి నేల తన సహజ స్వభావాన్ని కోల్పొనుంది. తర్వాత ఆ నేలలు ఆమ్లయుతంగా లేదంటే క్షారయుతంగా తయారవుతాయి. ఎన్ని ఎరువులు వేసినా ఎంత పెట్టుబడి పెట్టిన పంటలు సరిగ్గా పండవు.

ప్రభుత్వం నిర్వహించే భూసార పరీక్షలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. మూస ధోరణిలో పంటలను సాగు చేయకుండా భూమిలో ఏ ఏ లోపాలున్నాయో తెలుసుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఉత్తమం. దీంతో పెట్టుబడి తగ్గనుండగా నాణ్యమైన పంట చేతికొస్తుంది. – రణధీర్‌రెడ్డి, ఏడీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement