నగదు నుంచి డిజిటల్‌కు అవినీతి మార్గం
రూటు మార్చిన పలువురు అధికారులు
ఫోన్‌పే, గూగుల్‌పే, క్యూఆర్ కోడ్ ద్వారా మామూళ్లు
వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
యూటీఆర్ నంబర్లే లంచాల రశీదులంటున్న అధికారులు
డిజిటల్ లంచాలపై ఏసీబీ స్పెషల్ ఫోకస్
కరీంనగర్ అర్బన్ ఎకై ్సజ్ సీఐ గుండెటి రాము వేములవాడలో పనిచేస్తున్న సమయంలో బెల్లం వ్యాపారి వద్ద రెండేళ్లపాటు తన మిత్రుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ద్వారా యూపీఐ పేమెంట్లతో లంచం తీసుకున్నాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు వెళ్లగా ఈనెల 18న రాము ఇంట్లో సోదాలు చేయగా.. రూ.20 లక్షల నగదు లభ్యమైంది. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని విడిచిపెట్టేందుకు యూపీఐ ద్వారా రూ.15వేల లంచం తీసుకున్న కేసులో గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ ఎస్సైగా పనిచేసిన వెంకటేశ్వర్లును కరీంనగర్ ఏసీబీ అధికారులు ఈనెల 24న అరెస్టు చేశారు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం సిద్దిపేట త్రీ టౌన్ ఎస్సైగా ఉన్నారు.
కాంట్రాక్టర్లు, ఉద్యోగుల వద్ద లంచం తీసుకున్న కేసులో కరీంనగర్ వర్క్ అకౌంట్స్ జాయింట్ కార్యాలయ సూపరింటెండెంట్ ఈగల మధుసూదన్‌ను ఈనెల 16న ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
ఓ బినామీ అకౌంట్ నుంచి యూపీఐ ద్వారా రూ.14,77,003 లంచం తీసుకున్నాడని వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
● జిల్లాలోని అవినీతి ఉద్యోగులపై ఏసీబీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ వర్గాలు నిఘా పెంచాయి. రెవెన్యూ, పోలీసు, ఎకై ్సజ్‌శాఖ, రిజిస్ట్రేషన్‌శాఖ, మున్సిపల్, రవాణాశాఖలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలపై దృష్టి సారించాయి. లంచగొండి అధికారులపై కన్నేశాయి.
● రెవెన్యూశాఖలో ప్రతి పనికో రేటు నిర్ణయించి కొందరు అధికారులు కిందిస్థాయి సిబ్బంది ద్వారా లంచం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. మీసేవా కేంద్రాలు, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యక్తుల ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, వివిధ రకాల సర్టిఫికెట్ల వ్యవహారాల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
● జిల్లాలోని పలువైన్స్‌లు, బార్ల నుంచి ఎకై ్సజ్‌శాఖ, పోలీసుశాఖ అధికారులకు మామూళ్లు అందుతున్నాయని చర్చ జరుగుతోంది. పలు వైన్స్‌లు, బార్ల నుంచి ఎవరు రెగ్యులర్‌గా మామూళ్లు వసూలు చేస్తున్నారు? ఏ రూపంలో తీసుకుంటున్నారు? ఏఏ స్థాయి అధికారులకు ఎంత మొత్తంలో వెళ్తోంది, పలువురు అధికారులు వాడిన యూపీఐ లావాదేవీలపై ఏసీబీ అధికారులు నజర్ పెట్టారు.
● రిజిస్ట్రేషన్‌శాఖలో కొందరు అధికారులు ఓపెన్‌ప్లాట్‌కు కొంత, నివాసానికి కొంతమొత్తాన్ని నిర్ణయించి డాక్యుమెంట్ రైటర్ల ద్వారా లంచం తీసుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. రిజిస్ట్రేషన్‌శాఖలో పనిచేసే ప్రైవేట్ సిబ్బంది ద్వారా జరుగుతున్న అవినీతి, యూపీఐ లావా దేవీలపై ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం.


