పెట్రోలు, డీజిల్ కొరత.. వాహనదారుల వెత
పెట్రోల్ బంకుల్లో బారులు
స్టాక్ లేక పలుచోట్ల మూసివేత
ఓన్లీ క్యాష్ అంటూ బోర్డులు
పవర్ పెట్రోలే ఉందంటూ జిమ్మిక్కులు
కరీంనగర్ అర్బన్: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కరీంనగర్‌ను తాకిందా..? బంకులే కృత్రి మ కొరత సృష్టించాయా..? అంటే అవునో కాదో అర్థం కాని దుస్థితి. ప్రభు త్వ యంత్రాంగం ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తుండగా, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బా రులు తీరగా పలు బంక్‌లు మూసివేశారు. మరికొన్నింట్లో పవర్ పెట్రోలే ఉందంటూ జిమ్మిక్కులు చేశారు. ఇంధన కొరత పుకార్లతో బుధవారం ఉదయం నుంచే వాహనదారులు బంకుల వద్ద బారులు తీరగా ని యంత్రించేందుకు సిబ్బంది పాట్లు పడ్డారు. జిల్లాలో 159, నగరంలో 39 పెట్రోల్ బంకులుండగా అంతటా ఇదే పరిస్థితి.
కృత్రిమ కొరత
పలు పెట్రోల్ బంకుల యజమానులు ఇంధన కృత్రిమ కొరత సృష్టించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని భావించి నగరంలోని పలు బంకులు మూసివేశారు. ఇంకొందరు పవర్ పెట్రోలే ఉందని తమ విక్రయాలు పెరిగేలా జిమ్మిక్కులు చేశారు. పవర్ పెట్రోల్ పాత నిల్వ ఉండగా ఇటీవలే ధర పెరిగింది. దీంతో పాత నిల్వకు కొత్త ధరతో విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
కొత్త నిబంధనలే కారణమా?
ఆయిల్ కంపెనీలు కొత్త నిబంధనలు అమలు చేస్తుండడమే ఇందుకు కారణమని తెలు స్తోంది. గతంలో ఆయిల్ సంస్థలు డబ్బులు తీసుకోకుండానే తొలుత డీజిల్, పెట్రోల్ సరఫరా చేసేవి. మూడు నాలుగు రోజులు గా ఎంత ఇంధనం కావాలంటే ఆ మేరకు డబ్బులు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని ఆయి ల్ సంస్థలు స్పష్టం చేయడంతో పలు బంకులకు సరఫరా ఆగిపోయింది. పాతబకాయిలు జమచేయడంతో పాటు కొత్తగా స్టాక్‌కు డబ్బులు ముందే చెల్లించాలని చెబుతుండడంతో నగరంలో పలు చోట్ల బంకులు మూతపడ్డాయి. దీంతో పెట్రోల్ ఉన్న బంకులపై ఒత్తిడి పెరిగి ఒక్క రోజులోనే స్టాకు అయిపోతోంది. మళ్లీ స్టాకు వచ్చేవరకు ఆ బంకులు మూతపడుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ఉద్దేశ పూర్వకంగానే బంకులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పెట్రోలు బంకుల యజమానులు ఆరోపిస్తున్నారు.
ప్రేక్షక పాత్రలో సివిల్ సప్లయ్
కంపెనీలు, పెట్రోల్ బంకులు మధ్య ఏర్పడిన వివాదంతో బంకులు మూతపడుతు న్నా పౌరసరఫరాలశాఖ చోద్యం చూస్తోంది. పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని చేతులు దులిపేసుకుంటోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యం చేస్తే ఇంధనం లభించదనే ఆందోళనతో జనం బంకులకు పరుగులు తీస్తున్నా, నగరంలో బంకులు మూతపడినా పౌరసరఫరాలశాఖ స్పందించకపోవడం గమనార్హం.


