కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నగరంలోని 44వ డివిజన్ సప్తగిరికాలనీ కస్తూరి బా గాంధీ పాఠశాలలో నాబార్డ్ నిధులు రూ.38 లక్షలతో చేపట్టనున్న సైన్స్ ల్యాబ్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ చాడగొండ కవిత బుచ్చిరెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. 49వ డివిజన్ సంతోష్‌నగర్‌లో కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి ప్రకాశ్‌తో కలిసి సంతోషిమాత ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. భాగ్యనగర్‌కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4 లక్షలతో చేపట్టనున్న తాగునీటి నీటి సరఫరా పైప్‌లైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సప్తగిరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వాకింగ్ ట్రాక్, ఓపెన్‌జిమ్ ఏర్పాటు చేశామన్నారు. భాగ్యనగర్‌లో తాగునీటి పైప్‌లైన్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, కర్రె పద్మ అనిల్, గాజ రమ శివరాం, డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వన్ టైం సెటిల్‌మెంట్‌కు అవకాశం కల్పించండి
నగరపాలకసంస్థ ఆస్తిపన్నుకు సంబంధించి వన్‌టైం సెటిల్‌మెంట్ పథకానికి అవకాశం కల్పించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్యమంత్రి, మున్సిపల్‌శాఖ మంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. 2024–25 సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిల వడ్డీ, పెనాల్టీపై 90 శాతం రాయితీ ఇస్తూ, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి వడ్డీ,పెనాల్టీలతో సహా మొత్తం బకాయిలను చెల్లించిన ఇంటి యజమానులకు, వారు చెల్లించిన వడ్డీ మొత్తంలో 90 శాతాన్ని భవిష్యత్తు ఆస్తి పన్ను చెల్లింపుల్లో సర్దుబాటు చేసుకోవడానికి అనుమతించాలన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ చెల్లించే ఇంటి యజమానులకు 5నుంచి 10 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు.


