కరీంనగర్‌టౌన్: జిల్లా విద్యాశాఖలో ఇన్‌చార్జీల పాలన సాగుతోంది. జిల్లా విద్యాశాఖాధికారిగా రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ ఎంఈవో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో మండలాల పరిధిలోని సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. దీంతో పదో తరగతి పరీక్షల ఫలితాల ప్రభావం ఎలా ఉంటుందోననే సందేహం నెలకొంది. అదనపు బాధ్యతలతో ప్రధానోపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో ఎంఈవోలు లేకపోవడంతో విద్యావ్యవస్థ పర్యవేక్షణ గాడి తప్పుతోంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజన అమలు, సర్వశిక్షా అభియాన్ చేపట్టే విద్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎంఈఓల పాత్ర కీలకం. ఏళ్ల తరబడి రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో ఖాళీగా ఉన్న వీరి స్థానాల్లో సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఇన్‌చార్జీలుగా నియమిస్తున్నారు.
ఉపవిద్యాధికారులు ఇన్‌చార్జీలే
జిల్లాలో విద్యావ్యవస్థపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ పాఠశాలల నిర్వహణ, పనితీరు మధ్యాహ్న భోజనం అమలు, ఎస్‌ఎస్‌ఏ చేపట్టే ఇతర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలించి జిల్లా విద్యాధికారికి నివేదిక ఇవ్వాల్సిన ఉపవిద్యాధికారులు సైతం అందరూ ఇన్‌చార్జీలే. హుజూరాబాద్, కరీంనగర్, ఆర్‌ఎంఎస్‌ఏ పీవో, జిల్లా పరిషత్ డిప్యూటీ ఈవోలుగా రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇన్‌చార్జీల పాలనే కోనసాగుతోంది.
పరీక్షల నిర్వహణ ఎలా
మార్చి 14 నుంచి పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు డిపార్టుమెంటల్ అధికారుల నియామకం మాత్రమే పూర్తయింది. ఇంటర్నల్ మార్కుల జాబితా బోర్డుకు పంపి ఆమోదం పొందాలి. ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్‌స్క్యాడ్, సిట్టింగ్ స్క్యాడ్, రూల్ ఆఫీసర్ల నియమాకం చేపట్టాలి. ఇదంతా చేయడం కత్తిమీద సాములాంటిదే. ఈ విధులు నిర్వహించడం సీనియార్టీతో ముడుపడి ఉంటుంది. ఏ ఒక్కరి నియమాకంలో తేడా వచ్చిన పరీక్షల సమయంలో ఇబ్బందలు తప్పవు. ఇవన్నింటిని తట్టుకోవాలంటే రెగ్యులర్ డీఈవో తప్పనిసరి.
పనులపై పర్యవేక్షణ ఎలా
రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో విద్యాశాఖ వ్యవస్థ గాడి తప్పుతోంది. జిల్లాలో పదోతరగతి పరీక్షల నిర్వహణతో పాటు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలతో పాటు టైప్‌రైటింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడర్, డ్రాయింగ్, బీఎడ్, డీఎడ్ ప్రవేశ పరీక్షలు డీఈవో నిర్వహించాల్సి ఉంటుంది. డిప్యూటి ఈవో లేకపోవంతో ఈ బాధ్యతలను కూడా డీఈవోనే నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. వీటితో పాటు ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ఇన్‌చార్జీగా విధులు నిర్వహించేవారు శాఖపరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పరిపాలన పరమైన ఇబ్బందులు తప్పవని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
డీఈవోతో పాటు 16 మండలాలకు ఎంఈవోలు ఇన్‌చార్జీలే
హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలతో సతమతం


