పోటీ చేసి.. పెత్తనం చూపి | - | Sakshi
Sakshi News home page

పోటీ చేసి.. పెత్తనం చూపి

Mar 23 2026 8:50 AM | Updated on Mar 23 2026 8:50 AM

నగరంలో ‘కంటెస్టెడ్‌ క్యాండిడేట్‌’లతో పరేషాన్‌

పొలిటికల్‌ సర్కిళ్లలో విడ్డూరం

పోటీని పదవిగా మలుచుకుంటున్న వైనం

ఎన్నికల్లో పోటీ చేస్తే పదవి వచ్చినట్లేనా?

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ‘మీరు కార్పొరేటర్‌, మేయర్‌, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారా..? జస్ట్‌ ఎన్నికల్లో నామినేషన్‌ వేసి పోటీలో ఉంటే చాలు కోరుకున్న పదవి చేతికొస్తుంది. ఇదేంటి..? పోటీలో ఉండాలి, ప్రజల ఆదరణ పొందాలి. రూ.లక్షల్లో ఖర్చు చేయాలి. ప్రత్యర్థిపై గెలవాలి. ఇవన్నీ లేకుండానే పోటీచేస్తే చాలు పదవి వస్తుందని ఎలా అంటున్నారని విసుక్కోకండి. ఇప్పుడు నడుస్తున్న రాజకీయ విడ్డూరం ఇదే. ఎన్నికల్లో గెలవడం అనేది ఇక్కడ అనవసరం. జస్ట్‌ పోటీచేస్తే చాలు పదవి వచ్చినట్లే. ఆ పదవి పేరే ‘కంటెస్టెడ్‌ క్యాండిడేట్‌’.

ఫ్లెక్సీలు, కార్లకు బోర్డులు

వివిధ రాజకీయ పదవులకు జరిగే ఎన్నికల్లో పోటీచేసే వారిని అప్పటి మట్టుకే అభ్యర్థులుగా పరిగణిస్తారు. ఉదాహరణకు కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీచేసిన అందరిని అభ్యర్థులనే అంటారు. గెలిచిన వారిని కార్పొరేటర్‌ అంటారు. ఓడిపోయిన వాళ్లకు పోటీచేసిన చరిత్ర మాత్రమే ఉంటుంది. కాని ఈ పద్ధతిని తిరగరాస్తున్న జిల్లాలో, ముఖ్యంగా కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో కొంతమంది నాయకులు, ఓడిపోయినా ‘కంటెస్టెడ్‌ క్యాండిడేట్‌’ అనే పదవిని తమకు తామే సృష్టించుకుంటున్నారు. ఏకంగా వారి పేరిట ‘కంటెస్టెడ్‌ కార్పొరేటర్‌’, ‘కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే’ అంటూ విజిటింగ్‌కార్డ్స్‌, ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. కార్లకు బోర్డులు తగిలించుకుంటున్నారు.

లేని ‘అధికారం’తో పెత్తనం

పదవుల్లో లేని వాళ్లు, కేవలం పోటీచేశామనే సాకుతో సొంతంగా పదవులు సృష్టించుకుని అధికారులపై పెత్తనం సాగిస్తున్నారు. ‘కంటెస్టెడ్‌’ను పదవిగా మలుచుకొని పైరవీలు చేయడం, తమపై గెలిచిన వాళ్లకు సమాంతరంగా అధికారాన్ని చెలాయించాలనుకొనే కొత్త సాంప్రదాయం ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. ఓటమిని విజయానికి మెట్టుగా మలచుకొని మరోసారి ప్రజాతీర్పుతో పదవులు సంపాదించుకోవాలి తప్ప ‘కంటెస్టెడ్‌’ పదవులను సృష్టించుకుని తమకు తాము పలుచన కావద్దంటూ రాజకీయ సీనియర్లు హితవు పలుకుతున్నారు.

‘ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు రంజా న్‌ తోఫా కిట్లు ఇచ్చింది. అధికార పార్టీగా కాంగ్రెస్‌ నేతలు నగరంలోని ముస్లిం కుటుంబాలకు అందించారు. రంజాన్‌ తోఫా కిట్లను తనకు కూడా ‘వాటా’ ప్రకారం కేటాయించాలంటూ ‘కంటెస్టెడ్‌ క్యాండిడేట్‌’ ఒకరు, నగరానికి సంబంధించిన ఓ అధికారికి ఫోన్‌చేశారు. తనకు వెంటనే కిట్లు పంపించాలంటూ హుకూం జారీ చేశారు. ఇంతకు మీరెవరు అని సదరు అధికారి ప్రశ్నిస్తే, తాను ఫలానా పదవికి సంబంధించిన ‘కంటెస్టెడ్‌ క్యాండిడేట్‌’నంటూ సెలవివ్వడంతో ఆ అధికారి అవాక్కయ్యాడు.’

‘నగరంలో ఇటీవల పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఓ యువకుడు బైక్‌పై వేగంగా వచ్చి ఆగాడు. పోలీసులు బ్రీత్‌ఎనలైజర్‌ పరీక్ష చేస్తుండగా సదరు యువకుడు ఎవరికో ఫోన్‌ చేసి మాట్లాడాలంటూ పోలీసులకు ఇచ్చాడు. ‘ఆ పిలగాడు మనోడే వదిలేయండి..’ అని అవతలి నుంచి ఆర్డర్‌ వచ్చింది. ఇంతకు మీరెవరంటూ పోలీసులు ప్రశ్నిస్తే ‘నేను కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే’ను అంటూ సమాధానం ఇవ్వడంతో ఖంగు తినడం ఖాకీల వంతైంది.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement