ఖాతా ఇచ్చారో ఖతమే! | - | Sakshi
Sakshi News home page

ఖాతా ఇచ్చారో ఖతమే!

Mar 23 2026 8:50 AM | Updated on Mar 23 2026 8:50 AM

ఈజీ మనీ కోసం మ్యూల్‌ అకౌంట్లుగా బదిలీ కరీంనగర్‌లో సైబర్‌ నేరస్తులకు సహకరిస్తున్న ముఠాలు ఇటీవల 12మందిని అరెస్టు చేసిన పోలీసులు బ్యాంకు ఖాతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచన

బ్యాంకు ఖాతాలు ఇవ్వొద్దు

కరీంనగర్‌క్రైం: మీకు బ్యాంకు ఖాతా ఉందా..? దాన్ని రెగ్యులర్‌గా వాడుతున్నారా..? ఎవరైనా ఖాతా నంబరు, పాస్‌ బుక్‌ అడిగితే ఇచ్చారా..? మీ అకౌంట్‌కు డబ్బులు పంపిస్తామని చెబితే నమ్మి సరే అన్నారా..? అయితే తస్మాత్‌ జాగ్రత్త.. సైబర్‌ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. వాళ్లు కాజేసిన డబ్బుతో లావాదేవీలు కొనసాగించేందుకు ఇతరుల బ్యాంకు ఖాతాలు వినియోగిస్తున్నారు. వీటినే మనీ మ్యూల్‌ ఖాతాలు అంటారు. ఈ అకౌంట్ల మోసాలు ఇప్పుడు జిల్లాలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి. నగరంలో పలువురు సైబర్‌ నేరగాళ్లకు మ్యూల్‌ అకౌంట్లు అందిస్తూ ఇటీవల పోలీసులకు చిక్కారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దారిని ఎంచుకోగా నేరం చేసిన వారందరూ 22 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే.

సైబర్‌ నేరాలు కొత్త పుంతలు

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్ద్దీ సైబర్‌ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బును వారి ఖాతాల్లో ఉంచకుండా ఇతరుల ఖాతాలను మళ్లిస్తుంటారు. ఇందుకు కీలక ఆయుధం ‘మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతా లు’. కొందరు మధ్యవర్తులు కమీషన్‌కు ఆశపడి అమాయక వ్యక్తుల పేర్లతో లేదా స్వయంగా బ్యాంకుల్లో సేవింగ్‌, కరెంట్‌ ఖాతాలు తెరిచి, వాటికి సంబంధించిన పాస్‌బుక్కులు, ఏటీఎం కార్డులు, సిమ్‌ కార్డులు దేశ, విదేశాల్లో ఉన్న సైబర్‌ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు. సైబర్‌ మోసాల్లో బాధితుల నుంచి డబ్బు ముందుగా ఈ ఖాతాల్లోకి జమవుతుంది. తరువాత వేరే ఖాతాలకు బదిలీ చేయడం లేదా నగదుగా ఉపసంహరించుకోవడం జరుగుతుంది. ఇందుకోసం ఆ ఖాతాదారులకు, అప్పగించిన వారికి కమీషన్‌ ఇస్తుంటారు.

ఉచ్చులో యువత

ఈజీమనీ ఆశతో యువత సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. కొందరికి ఖాతా ఇవ్వడానికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు కమీషన్‌ ఇస్తున్నా రు. తాజాగా కరీంనగర్‌ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్‌ క్రాక్‌డౌన్‌’లో అరెస్టయిన 12 మంది 22ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య వయసు కలిగిన యువకులే. ఈజీ మనీ సంపాదనకు అలవాటు పడి సైబర్‌ నేరగాళ్లకు సహకరించారు. ఇతరుల బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డులు సైబర్‌ నేరస్తులకు అప్పగించేవారు. కరీంనగర్‌లో నమోదైన ఓ సైబర్‌ మోసం కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు డబ్బు వెళ్లిన బ్యాంక్‌ ఖాతాలు ట్రాక్‌ చేశారు. లోతైన విచారణ జరిపి, 12మందిని అరెస్టు చేసి, బ్యాంక్‌ పత్రాలు, ఖాతాలు, సిమ్‌ కార్డులు, ఇతర కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక కేసుతోనే ఇంత మంది భయటపడ్డారంటే లోతైన దర్యాప్తు జరిగితే మ్యూల్‌ అకౌంట్ల ముఠాలో ఇంకా ఎంతమంది ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. మ్యూల్‌ అకౌంట్లలో ముందుగా బలయ్యేది ఖాతాదారులే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంటున్నారు. ఈజీ మనీకి యువత బానిస కొవొద్దని, సైబర్‌ నేరగాళ్లకు సహకరించి, బంగారు భవితను నాశనం చేసుకోవద్దని కోరుతున్నారు.

తెలియని వ్యక్తులకు బ్యాంక్‌ ఖాతాలు, ఏటీఎం కార్డులు, సిమ్‌ కార్డులు ఇవ్వడం చట్ట రీత్యా నేరం. డబ్బుల కో సం ఆశపడి వివరాలు ఇవ్వకూడదు. వాటితో నేరాలు జరిగితే నిందితులుగా కేసులు నమోదు చేస్తాం. సైబర్‌ నేరాలకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. యువత ఈజీ మనీ కోసం ఇలాంటి నేరాల్లో పడితే భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తెలియని వ్యక్తుల సూచనలతో బ్యాంక్‌ ఖాతాలు తెరవడం, సిమ్‌ కార్డులు ఇ వ్వడం, ఆన్‌లైన్‌ లావాదేవీల్లో పాల్గొనడం వంటి చర్యల నుంచి దూరంగా ఉండాలి.

– గౌస్‌ ఆలం, కరీంనగర్‌ సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement