సబ్సిడీ గ్యాస్‌.. తుస్‌! | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీ గ్యాస్‌.. తుస్‌!

Mar 23 2026 8:50 AM | Updated on Mar 23 2026 8:50 AM

● వెలగని ‘మహాలక్ష్మి’● రూ.500కే గ్యాస్‌ ఉత్తదేనా? ● ఆ డబ్బులు ఎవరి ఖాతాకో? ● జిల్లాలో వేలమంది నిరీక్షణ

కరీంనగర్‌ అర్బన్‌: మహిళలకు వంటింట చేయూతగా ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించింది. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యతనివ్వగా 6నెలల పాటు రూ.500 మహిళల పేరుతో ఉన్న గ్యాస్‌ కనెక్షన్లకు అందజేసింది. గ్యాస్‌ బుక్‌ చేసుకుని డోర్‌డెలివరీ అయిన తదుపరి మహిళల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. క్రమేణా ఖాతాలకు జమకాకపోవడంతో గ్యాస్‌ ఏజెన్సీల వద్ద ఆరా తీయడం, నిరాశగా వెనుదిరుగుతున్నారు.

రూ.500 ఎవరి ఖాతాకు చేరుతున్నట్లు

మహిళలకు గ్యాస్‌ కోసం ఇస్తామన్న రూ.500 ఎవరి ఖాతాకు చేరుతున్నాయన్నది స్పష్టత లేదు. మీమీ ఏజెన్సీ పరిధిలో ఎంతమందికి లబ్ధి చేకూరుతుందని ఆరా తీస్తే గ్యాస్‌ ఏజెన్సీల వద్ద స్పష్టమైన సమాచారం లేదు. తమ వద్ద సమాచారం లేదని చెప్పడం పౌరసరఫరాలశాఖ అధికారులకే చెల్లు. జిల్లాలో 3.50లక్షల మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా ఇందులో 2.10లక్షల వరకు మహిళల పేరున గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని సమాచారం. ఈ లెక్కన ఒక్కసారి బుక్‌ చేస్తే రూ.10కోట్లు ఖాతాలకు చేరాల్సి ఉండగా ఏడాదికి 8 సిలిండర్లు లెక్కేసినా రూ.84కోట్లు జమ కావాల్సి ఉంది.

నగరంలోని గణేశ్‌నగర్‌కు చెందిన సావిత్రికి ఇండెన్‌ గ్యాస్‌ ఏజెన్సీలో కనెక్షన్‌ ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలోనూ దరఖాస్తు చేసింది. రెండు, మూడు సార్లు రూ.500 జమకాగా ఏడాదిన్నరగా జమ కావడం లేదు.

జమ్మికుంట మండలం రామన్నపల్లికి చెందిన మర్రి సునీతకు ఇండెన్‌ గ్యాస్‌ కనెక్షన్‌ ఉంది. మూడుసార్లు రూ.500 ఖాతాలో జమవగా రెండేళ్లుగా జమవడం లేదు. రూ. 500కే గ్యాస్‌ అన్నరు.. అంతలోనే అటకెక్కించారని సునీత వాపోతోంది. ఇది వీరిద్దరి సమస్యే కాదు జిల్లావ్యాప్తంగా వేలమంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. ఇండెన్‌ గ్యాసే కాదు భారత్‌, హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీల్లోనూ ఇదే దుస్థితి.

సబ్సిడీ పడాల్సింది ఇలా

ప్రస్తుతం వంట గ్యాస్‌ ధర: రూ.985

వినియోగదారు చెల్లించాల్సింది: రూ.985

సబ్సిడీ జమ కావాల్సింది: రూ.500

పడుతున్న భారం: రూ.485

ఏడాదికి వినియోగించే సిలిండర్లు: 8

ఈ లెక్కన మహిళలకు నష్టం: రూ.4వేలు

అధికారులు

ఏం చెబుతున్నారంటే

రూ.500కే గ్యాస్‌ లబ్ధిదారులుగా ఉండాలంటే ఆధార్‌, బ్యాంకు, గ్యాస్‌ కనెక్షన్‌ లింక్‌ ఉండాలని, ఈ మూడు ఒకే పేరుతో లింక్‌ లేకపోతే డబ్బులు జమకావని చెబుతున్నారు. ఈకేవైసీ చేయకపోవడం అంటే రేషన్‌ కార్డు లేదా గ్యాస్‌ కనెక్షన్‌ ఈకేవైసీ పూర్తి కాకపోతే సబ్సిడీ నిలిచిపోతుంది. బ్యాంకు వివరాల్లో తప్పులున్నా, డూప్లికేట్‌ గ్యాస్‌ కనెక్షన్‌ అంటే ఒక కుటుంబానికి ఒక సబ్సిడీ మాత్రమే వర్తిస్తుందని చెబుతున్నారు. ప్రజాపాలనలో అప్లికేషన్‌ చేయకపోతే సబ్సిడీ రాదని అధికారులు చెబుతుండగా మొదట్లో సబ్సిడీ పడి తదుపరి పడకపోవడంపై సమాధానం కరువైంది.

జిల్లా వివరాలు

జిల్లా జనాభా: 10,05,711

నివాసాలు: 2,58,485

డొమెస్టిక్‌ గ్యాస్‌ కనెక్షన్లు: 3,50,000

కమర్షియల్‌ కనెక్షన్లు: 80,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement