కొడిమ్యాల: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన కొడిమ్యాలలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ వివరాల ప్రకారం.. నాచుపల్లికి చెందిన గుగ్గిళ్ల పవన్ (27) ఏడేళ్ల క్రితం డెయిరీఫాం ప్రారంభించాడు. నష్టాలు రావడంతో అప్పులు పెరిగాయి. బ్యాంకు లోన్ భారంతో మనస్తాపానికి గురై ఈనెల 13న ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పవన్ తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ధర్మపురిలో వివాహిత..
ధర్మపురి: భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పటించగా చికిత్స పొందుతూ వివాహిత శనివారం మృతి చెందినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ధర్మపురిలోని ఎస్సీ కాలనీకి చెందిన బడగు నవీన్, మండలంలోని తుమ్మెనాలకు చెందిన రమ్య నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య తగాదాలు రావడంతో రమ్య పుట్టింటికి వెల్లింది. రమ్యపై కోపం పెంచుకున్న నవీన్ ఈనెల 16న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. గాయపడిన రమ్యను వరంగల్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.


