కరీంనగర్‌టౌన్: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ)పరిధి బాసర ట్రిపుల్ ఐటీలో 2026–27 విద్యా సంవత్సరం(1,500 మంది) ప్రవేశాలకు ఈనెల 16న నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో విడుదలకానున్న పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించి రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కుల చొప్పున కలుపుతారు.
ప్రవేశాల షెడ్యూల్
● ఈనెల 18 నుంచి మే 10 వరకు దరఖాస్తుల స్వీకరణ. మే 25 వరకు వికలాంగులు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, గ్లోబల్ కేటగిరికి చెందినవారికి, మే 30 విద్యార్థుల ఎంపిక జాబితా, జూన్ 5న తొలి విడత కౌన్సెలింగ్(ధ్రువపత్రాల పరిశీలన).
ప్రవేశ అర్హతలు
● విద్యార్థులు ప్రథమ ప్రయత్నంలో 2026–ఎస్సెస్సీ, తత్సమాన పరీక్షలో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. 31–12–2026 నాటికి 18 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు.
జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు
● పదో తరగతిలో మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4డిప్రెవేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు. బాసర ట్రిపుల్ ఐటీలో 85శాతం సీట్లు స్థానికంగా, 15 శాతం మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు.
రిజర్వేషన్లు
● ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ–ఏ 7, బీసీబీ 10, బీసీ–సీ 1, బీసీ–డీ 7, బీసీ–ఈలకు 4 శాతం.
● ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2, ఎన్‌సీసీ విద్యార్థులకు ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.
● రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కాాకుండా వేరే రాష్ట్రాల వారికి, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు.
ఫీజు వివరాలు
రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రవేశ సమయంలో ఆరోగ్యబీమా, ఇతరాలకు సంబంధించి రూ.3,500 ఇతరులకు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,000 చెల్లించాలి. క్యాషన్(దీనిని తిరిగి ఇస్తారు)డిపాజిట్ కింద ఎ కేటగిరి అభ్యర్థులైనా రూ.2,000 చెల్లించాలి. ఇతర రాష్ట్రాలు, గల్ఫ్‌దేశాల్లో పని చేసేవారి పిల్లలు ఏడాదికి రూ.1.36 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి.
మార్కులు సమానమైతే..
ట్రిపుల్ ఐటీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న ఇద్దరి విద్యార్థుల మార్కులు ఒక్కటే అయితే వరుసగా గణితం, జనరల్‌సైన్స్, ఇంగ్లిష్, సోషల్‌లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్‌లో ఎక్కువ గ్రేడ్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలు
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్‌టికెట్, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కుల ధ్రువవీకరణ పత్రాలు, వికలాంగులైతే వైకల్య నిర్ధారణ పత్రాలు, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
వసతులు
విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతో పాటు, రెండుజతల యూనిఫాం, షూలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు.
దరఖాస్తు ఇలా
అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ–సేవా, మీ–సేవా, టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుం రూ.500, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.450, వేరే రాష్ట్రం వారు రూ.1,500 చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ సార్లు దరఖాస్తు చేసుకుంటే చివరగా చేసుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు.
మే 10 వరకు గడువు
సెలెక్షన్ లిస్టు మే 30.. కౌన్సెలింగ్ జూన్ 5న
పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు సువర్ణావకాశం


