కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం నగునూరులో విద్యుత్ సామగ్రి చోరీకి పాల్పడిన నలుగురు దొంగలను అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 15న సిల్వర్‌స్ప్రింగ్ విల్లాస్‌లోని స్టోర్‌రూమ్‌లో సుమారు రూ.60వేల విలువైన విద్యుత్ వైరు బెండల్స్‌ను దొంగలు ఎత్తుకెళ్లగా, యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గురువారం తీగలగుట్టపల్లి–ఆరెపల్లి దారిలో ఎల్లమ్మ గుడి వద్ద ఉన్న నలుగురు వ్యక్తులు, పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. విచారణ చేయగా దొంగతనం చేసినట్లు అంగీకరించారు. బొంత కుమార్, అలకుంట్ల జంపయ్య అలియాస్ జంపరాజు, సూర శివాజి, నవీన్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. కొన్నేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఉపాధినిమిత్తం వచ్చిన ఈ నలుగురు వ్యక్తులు కుటుంబాలతో వావిలాలపల్లి, హనుమాన్‌నగర్‌లో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారని వివరించారు. మద్యానికి బానిసై సులువుగా డబ్బు సంపాదించాలని గతంలో విల్లాస్‌లకు కూలీపనులకు వెళ్లినపుడు విద్యుత్ సామగ్రి ఉండడంతో దొంగతనం చేసినట్లు తెలిపారు.
పిచ్చికుక్క దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు
మల్యాల: పిచ్చికుక్క దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడిన సంఘటన మల్యాలలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి ఆగంతపు లక్ష్మీ తన ఇంటి వద్ద ఉండగా.. పిచ్చికుక్క దాడి చేసింది. కుడిచేతిపై తీవ్ర గాయాలు కాగా వైద్యం కోసం జగిత్యాలకు తరలించారు.
సూర్యనగర్‌లో దొంగతనం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ నగరపాలక సంస్థ 23వ డివిజన్ సూర్యనగర్ రోడ్‌నంబర్– 5లో బుధవారం రాత్రి కళ్లెం వినయ్‌కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. స్థానికులు, కొత్తపల్లి పోలీసులు తెలిపిన వివరాలు.. ఉగాది పండగ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం వినయ్‌కుమార్ తన సొంతూరైన కల్లెంరెడ్డిపల్లెకి వెళ్లాడు. తాళం వేసి ఉన్నట్లు గమనించిన దొంగలు రాత్రి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. రూ.15 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కొటేశ్వర్ తెలిపారు. కాగా భవనాన్ని అందంగా నిర్మించుకొని కనీసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడంపై పోలీసులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫోరెన్సిక్ సిబ్బంది వచ్చి వేలిముద్రలు సేకరించారు.
ఇసుక లారీ పట్టివేత
కథలాపూర్: మండలంలోని గంభీర్‌పూర్ శివారు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా లారీని పట్టుకుని యజమాని అయిన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన అల్లెపు రవిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


