వందల మంది బాధితులు
విరుగుడు లేదు
కరీంనగర్: పంట పొలాలు, ఇంటి పరిసరాల్లో పెరిగిన కలుపును నాశనం చేసేందుకు వాడే పారాక్వాట్ క్రిమిసంహారక మందు మనుషుల ప్రాణాలు తీస్తోంది. గ్రామాల్లోని రైతుల ఇళ్లల్లో, పొలాల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ మందు, ఇప్పుడు పట్టణాల్లోని వారికి సైతం ఫెర్టిలైజర్స్ షాపుల్లో లభ్యమవుతోంది. దీంతో క్షణికావేశంలో దీన్ని తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు. యాసిడ్ కన్నా పదుల రెట్ల గాఢత కలిగిన ఈ ద్రావణాన్ని తాగిన వారు 99 శాతం మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. కాగా.. ఏఈవో ప్రిస్కిప్షన్‌లో రాసిస్తేనే గడ్డిమందు ఇవ్వాలని ఇటీవల వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పాయిజన్ కేసుల్లో పారాక్వాటే ఎక్కువ
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే పాయిజన్ కేసుల్లో అధిక శాతం పారాక్వాట్ క్రిమిసంహారక రసాయన మందు తాగినట్లు నమోదవుతోంది. పంట పొలాల్లో కలుపు తీయడానికి ఈ మందును ఎక్కువగా వాడుతుంటారు. వందల లీటర్ల నీటిలో రెండు, మూడు మూతల ద్రావణాన్ని కలిపి ఎకరాల కొద్ది పొలాల్లో పిచికారీ చేస్తారు. కొద్ది నిమిషాల్లోనే కలుపు మొక్కలు మాడిపోతాయి. అలాంటిది నేరుగా ద్రావణాన్ని తాగితే పరిస్థితి ఎలాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. గుక్కెడు తాగగానే తట్టుకోలేక పారేసే పరిస్థితి ఉంటుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ ద్రావణం వేగంగా శరీరంలోని జీవకణాలను, అంతర్భాగాల్లోని పైపొరలను దెబ్బతీస్తూ వెళ్లి ప్రాణాలు తీస్తుంది.
నిషేధం కోసం పెరుగుతున్న డిమాండ్
పారాక్వాట్ రసాయనాన్ని అభివృద్ది చెందిన దేశాల్లో, మనదేశంలో కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు. కానీ ఇక్కడ పప్పు, బెల్లాల్లా దుకాణాల్లో లభ్యమవుతోంది. పారాక్వాట్ నిషేధించాలని కోరుతూ జిల్లాలో పలువురు వైద్యులు ఇటీవల కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. కొంత మంది వైద్యులు ఢిల్లీ వరకు వెళ్లి కేంద్ర మంత్రులకు సైతం వినతిపత్రాలు అందజేస్తున్నారు.
ఇక.. వ్యవసాయాధికారులు ధ్రువీకరిస్తేనే
రైతులకు పారాక్వాట్ డైక్లోరైడ్ కావాలంటే వ్యవసాయాధికారులను కలవాలి. వారు క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలిస్తారు. దీని ఆధారంగానే ఆ పంటకు పొలానికి ఏయే మందులను కొనుగోలు చేయాలనే విషయాలను ప్రిస్కిప్షన్ ఇస్తారు. ఆ చీటీని తీసుకుని పురుగుల మందుల షాపులకు వెళ్లి కొనుగోలు చేయాల్సిఉంటుంది.
కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రికి ఈ మందు తాగి ఏడాది కాలంలో 80 మందికి పైగా చికిత్స కోసం వచ్చారు. ఈ ఆసుపత్రితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులకు ఏటా వందల మంది చికిత్స కోసం వస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 99 శాతం మంది మరణిస్తుండగా తక్కువ మోతాదులో తాగిన వారు మాత్రమే బతికిపోతున్నారు.
ప్రాణాలు తీస్తున్న పారాక్వాట్
క్షణికావేశంలో తాగుతూ.. ఏటా వందల మంది మృతి
పలు రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో నిషేధం
జిల్లాలోనూ పెరుగుతున్న డిమాండ్
పారాక్వాట్ విష రసాయన పదార్థానికి విరుగుడు లేదు. దీని ప్రభా వానికి గురైన వారి లక్షణాలను బట్టి వైద్యం చేస్తాం. దానివల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషం తీసుకున్న వారిలో 99 శాతం మంది మరణిస్తున్నారు. పారాక్వాట్ మింగినా, తాకినా చివరకు పీల్చినా విషప్రభావానికి గురైనట్లే. కేవలం ఒక టీ స్పూన్ పారాక్వాట్ తీసుకోవడం వల్ల మరణం సంభవించవచ్చు. ఈ రసాయనం దుస్తులు, కళ్లు, చర్మాన్ని తాకినా తీవ్ర అనారోగ్యం లేదా మరణానికి కారణం కావచ్చు.
– డాక్టర్ వీరారెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్


