● పోలీసుల ప్రత్యేక దృష్టి ● ఏడు అంశాలపై ప్రాథమిక నివేదిక
● నెల రోజుల్లో 41 కేసులు నమోదు
గోదావరిఖని: నేరాల నమోదు, దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయడానికి పోలీస్ వ్యవస్థలో కీలకమార్పులు చోటుచేసుకుంటున్నాయి. బాధితులకు అండగా ఉంటూ నేరస్తులను కఠినంగా శిక్షించేందుకు ఆధునిక పద్ధతులు అమలవుతున్నాయి. ఇందులో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ‘స్పాట్ ఎఫ్‌ఐఆర్’ ప్రక్రియకు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం తాజా పద్ధతి ప్రధాన లక్ష్యం.
డీజీపీ ప్రత్యేక దృష్టితో
రాష్ట్రంలో స్పాట్ ఎఫ్‌ఐఆర్ అమలుపై డీజీపీ ప్రత్యేక దృష్టిసారించారు. అన్ని జిల్లాలు, కమిషనరేట్‌లకు ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. ఈక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో స్పాట్ ఎఫ్‌ఐఆర్‌పై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కేసుల తీవ్రత, పోలీసుస్టేషన్‌కు వెళ్లడం కష్టంగా ఉండే వారికోసం ప్రాధాన్యం కల్పిస్తోంది. పోలీసు కమిషనరేట్‌లో గతనెలరోజుల్లో 41 స్పాట్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. బాధితులకు ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉండి కూడా ఫిర్యాదు చేసి అక్కడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం కల్పిస్తోంది.
ఎలా పనిచేస్తుంది?
పోలీస్ సిబ్బంది వద్ద టాబ్లెట్/మొబైల్ యాప్ ఉంటుంది. బాధితుడు లేదా సాక్షి ఇచ్చిన వివరాలు అక్కడికక్కడే నమోదు చేసి, డిజిటల్ సంతకం తీసుకోవడం ద్వారా వెంటనే సెంట్రల్ సర్వర్‌కు డేటా పంపించడం ఎఫ్‌ఐఆర్ నంబర్ తక్షణమే జనరేట్ అవుతుంది.
స్పాట్ ఎఫ్‌ఐఆర్ అంటే ?
స్పాట్ ఎఫ్‌ఐఆర్ ఇలా..
కొత్త విధానం ప్రకారం నేరం గురించి సమాచారం అందిన వెంటనే అధికార పరిధిలోని పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ విషయంలో అధికారి వెంటనే బాధితుడి ఇల్లు లేదా నేరం జరిగిన ప్రదేశం, ఆస్పత్రి, ఫిర్యాదుదారు ఎంచుకున్న ప్రాంతానికి వెళ్తారు. ఫిర్యాదును స్థానికంగా నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపుతారు. దాని కాపీని బాధితుడికి తమ ప్రాంతంలోనే అందిస్తారు. అవసరమైన చోట, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత నిబంధనల కింద స్టేట్‌మెంట్‌లను కూడా అదేస్థలంలో నమోదు చేస్తారు. అదేసమయంలో నేరం జరిగిన ప్రదేశం, ఆధారాలను భద్రపరుస్తారు. బాధితుడు గాయపడి చికిత్స పొందుతున్నట్లయితే.. పోలీసు సిబ్బంది బాధితుడి నివాసానికి, ఆస్పత్రికి వెళ్లి వివరాలను నమోదు చేస్తారు. ఆపై అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది. ఎఫ్‌ఐఆర్‌ను బాధితుడికి
ఇ–మెయిల్, వాట్సాప్ ద్వారా తెలియజేస్తారు. అవసరమైతే హార్డ్‌కాపీ అందిస్తారు.
ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలోనే పోలీస్‌లు మొబైల్ పరికరాలతో వివరాలు నమోదు చేసి.. ఆ వెంటనే ఎఫ్‌ఐఆర్(ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు) రాయడాన్ని స్పాట్ ఎఫ్‌ఐఆర్ అంటారు. ఇది సంప్రదాయ విధానానికి భిన్నంగా ఉండి, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు నమోదు చేసే విధానం.


