అడ్డదారిలో.. అడ్డగోలుగా | - | Sakshi
Sakshi News home page

అడ్డదారిలో.. అడ్డగోలుగా

Mar 18 2026 7:48 AM | Updated on Mar 18 2026 7:48 AM

జిల్లాలో 2,717 వేల కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లు

5,000కు పైగా హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు

ఎక్కువ సముదాయాల్లో వాడేది డొమెస్టిక్‌ సిలిండరే..

అధికారిక గణాంకాల్లో వెల్లడి

సబ్సిడీ గ్యాస్‌ పక్కదారిపై యంత్రాంగం మౌనవ్రతం

సీఎస్‌ఆర్‌ కనెక్షన్లా.. అవెక్కడా

జిల్లాలో గ్యాస్‌ ఏజెన్సీలు: 23

హెచ్‌పీసీఎల్‌: 09, ఐవోసీఎల్‌: 06

బీపీసీఎల్‌: 08

ఇటీవల హోటల్‌లో పట్టుకున్న డొమెస్టిక్‌ సిలిండర్లు

కరీంనగర్‌ అర్బన్‌: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో కమర్షియల్‌ గ్యాస్‌ పంపిణీలో మొన్నటి వరకు ప్రభుత్వం విధించిన నిబంధనలతో జిల్లాలోని పలు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు మూసివేత దిశకు చేరకున్నాయి. 20శాతం ఇబ్బంది ఉండగా... 80శాతం ఫుడ్‌ బిజినెస్‌ నిరాటంకంగా సాగుతోంది. ఇందుకు కారణంపై అధికారులు లెక్కలు వేయగా.. జిల్లాలో కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లు 2,717 ఉండగా.. ఐదువేలకు పైగా హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లలో వాడేది డొమెస్టిక్‌ గ్యాసేనని స్పష్టమవుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, టిఫిన్‌ సెంటర్లు, దాబాలు, ప్రైవేట్‌ హాస్టళ్లు ఇలా అన్నీ కలిపితే జిల్లాలో 7వేల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు ఎన్ని కమర్షియల్‌ కనెక్షన్లు ఉండాలి.? హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, ప్రైవేట్‌ హాస్టళ్లలో వాడుతున్న గ్యాస్‌ కమర్షియలేనా.? అలాగైతే లెక్క ఏదనే అనుమానం వ్యక్తమవుతోంది.

అంతటా డొమెస్టిక్‌ గ్యాసే

నిబంధనల ప్రకారం వ్యాపారం చేసే వారెవరైనా కమర్షియల్‌ కనెక్షన్‌ ఉండాలి. కరీంనగరంతో పాటు హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, మానకొండూరు, శంకరపట్నం, కొత్తపల్లి, తిమ్మాపూర్‌, కరీంనగర్‌ రూరల్‌, రామడుగు, చిగురుమామిడి, సైదాపూర్‌, వీణవంక, ఇల్లందకుంట మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆహార వ్యాపార కేంద్రాలు కోకొల్లలు. ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరని ప్రభుత్వ నిబంధనలు చెబుతుండగా యంత్రాంగ పర్యవేక్షణ కొరవడిందని స్పష్టమవుతోంది. ఒకవేళ ట్రేడ్‌ లైసెన్స్‌లు వేలల్లో ఉంటే కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లు 2,717 మాత్రమే ఉంటాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న కుటుంబాల కన్నా 1.70లక్షల కనెక్షన్లు ఎక్కువగా ఉండటం అధికారుల డొల్లతనాన్ని, కంపెనీల సేల్స్‌ ఆఫీసర్ల లోపాయికారి ఒప్పందాన్ని చాటుతోంది.

ప్రక్షాళన జరిగేనా?

కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్‌ గ్యాస్‌ను సబ్సిడీతో తక్కువ ధరకు ఇస్తోంది. డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.984 కాగా కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.2145. దీంతో పలు ఏజెన్సీలు దొడ్డిదారిన కనెక్షన్లు జారీ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ జరుగుతుండగా సగానికి పైగా కనెక్షన్లకు ఈకేవైసీ కాలేదని సమాచారం. సదరు ప్రక్రియలో ఏజెన్సీలు కఠినంగా వ్యవహరించాల్సి ఉండగా మెతక వైఖరి ప్రదర్శించడం అనుమానాలకు తావిస్తోంది.

కంపెనీస్‌ యాక్ట్‌ 2013 ఇండియా సీఎస్‌ఆర్‌ ప్రొవిజన్‌ ప్రకారం పెద్ద కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని సీఎస్‌ఆర్‌ కోసం ఖర్చు చేయా లి. లాభం సంపాదించడం కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనేది కంపెనీస్‌ సోషల్‌ రెస్సొసిబిలిటీ(సీఎస్‌ఆర్‌) ఉద్దేశం. ఈ విభాగంలో జిల్లాలో 27,454 గ్యాస్‌ కనెక్షన్లున్నాయని ఏజెన్సీలు చూపుతున్నాయి. మరి సదరు కనెక్షన్లు ఎవరికి ఇచ్చారు, ఎవరికి ప్రయోజనం అందిస్తున్నాయో తేల్చాల్సిన అవసరం అత్యవసరం. కలెక్టర్‌ చొరవ చూపి డొమెస్టిక్‌ గ్యాస్‌ సద్వినియోగం జరిగేలా చర్యలతో పాటు దుర్వినియోగంపై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement