జనగణన శిక్షణ షురూ | - | Sakshi
Sakshi News home page

జనగణన శిక్షణ షురూ

Mar 18 2026 7:48 AM | Updated on Mar 18 2026 7:48 AM

● మూడు దశలు.. ఏప్రిల్‌ 3తో ముగింపు ● మే 11 నుంచి జూన్‌ 9 వరకు హౌస్‌ లిస్టింగ్‌

కరీంనగర్‌ అర్బన్‌: జనగణన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే మాస్టర్‌ ట్రైనర్లకు హైదరాబాద్‌లో శిక్షణనివ్వగా జిల్లాకేంద్రంలో సంబంధిత అధి కారులకు శిక్షణనిస్తున్నారు. మూడు దశల్లో శిక్షణలు జరగనుండగా తొలి దశగా జిల్లా, సబ్‌ డిస్ట్రిక్ట్‌, చార్జి ఆఫీసర్లకు శిక్షణనిస్తున్నారు. మూడు రోజుల ప్రక్రియలో భాగంగా మంగళవారంతో ముగిసింది. సంబంధిత జిల్లా అధికారులతో పాటు తహసీల్దార్లు, డీటీలు, ఎంపీడీవోలు పాల్గొనగా జనగణనలో పాటించాల్సిన మెలకువలను నేర్చుకున్నారు. రెండో దశలో టెక్నికల్‌ అసిస్టెంట్‌, చార్జి క్లర్క్‌లకు ఈ నెల 24నుంచి 26వరకు మూడు రోజులు శిక్షణనివ్వనుండగా, మూడో దశలో ఫీల్డ్‌ ట్రైనర్లకు మూడు రోజులు ఏప్రిల్‌ 1 నుంచి 3వరకు శిక్షణనివ్వనున్నారు. శిక్షణ కలెక్టరేట్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఇక కార్పొరేషన్‌కు సంబంధించి రాష్ట్ర కమిషనర్‌ స్థాయిలో పర్యవేక్షణనుండగా హుజూరాబాద్‌, చొప్పదండి, జమ్మికుంట పట్టణాలతో పాటు ఇతర మండలా లన్నింటికి కలెక్టర్‌ చిత్రా మిశ్రా పర్యవేక్షణ ఉండనుంది.

మే 11 నుంచి హౌస్‌ లిస్టింగ్‌

జనగణనలో నివాసాల సంఖ్యను బట్టి ఎన్యుమరేటర్‌ బ్లాక్‌ను నిర్ణయిస్తారు. 120– 150 నివాసాలను ఒక బ్లాక్‌గా విభజించగా సదరు బ్లాక్‌కు ఒక ఎన్యుమరేటర్‌ను నియమిస్తారు. ఈ క్రమంలో బ్లాకుల సంఖ్య మునిసిపాలిటీల్లో పెరగగా పలు మండలాల్లో సంఖ్య తగ్గింది. కరీంనగర్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట మునిసిపాలిటీల్లో గ్రామాలను విలీనం చేయగా రూరల్‌ మండలాల్లో గ్రామాల సంఖ్య తగ్గింది. అత్యధికంగా కరీంనగర్‌లో బ్లాక్‌ల సంఖ్య ఉంది. గత జనగణనలో 388 బ్లాకులుగా లెక్కించగా ఈ సారి 808కి చేరింది. అంటే 420 బ్లాక్‌లు పెరిగాయన్న మాట. జమ్మికుంటలో గతంలో 139 బ్లాక్‌ల్లో గణన జరగగా ఈ సారి 83కు పరిమితమైంది. హుజూరాబాద్‌ రూరల్‌లో 124 బ్లాక్‌లు కాగా 79కు చేరింది. మే 11 నుంచి జూన్‌ 9వరకు హౌజ్‌ లిస్టింగ్‌ ప్రక్రియ చేపట్టనుండగా బ్లాక్‌ల సంఖ్య మరింత పెరగనుంది. ఎన్యుమరేటర్లుగా టీచర్లు ఉండనుండగా ప్రస్తుత జాబితా అంచనా మాత్రమే హౌజ్‌ లిస్టింగ్‌తో బ్లాక్‌ల సంఖ్యపై స్పష్టత రానుంది. 2027 ఫిబ్రవరిలో హౌజ్‌ సెన్సెస్‌ ప్రారంభం కా నుండగా ఏప్రిల్‌ వరకు ప్రక్రియ పూర్తయి మే లేదా జూన్‌లో పక్కా గణాంకాలు వెల్లడించనున్నారు.

జనగణనపై అవగాహనతో సాగండి

జనగణన– 2027 కోసం ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా సూచించారు. మంగళవారం నాటి జనగణన శిక్షణలో కలెక్టర్‌ మాట్లాడుతూ, జనగణన కోసం సూచించిన యాప్‌ రిజిస్ట్రేషన్‌, పనితీరు తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు వస్తుంటాయని, ఉన్నతాధికారులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకొని పకడ్బందీగా సర్వే నిర్వహించాలని అన్నారు. ఆర్డీవో మహేశ్వర్‌, జెడ్పీ సీఈవో శ్రీనివాస్‌, డీపీవో జగదీశ్వర్‌, సీపీవో రామ్‌ దత్తారెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement