కరీంనగర్‌టౌన్: బాలల హక్కుల పరిరక్షణపై గ్రామసభల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ సూచన మేరకు కలెక్టరేట్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరై మాట్లాడారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే గ్రామసభల్లో బాలల హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. బాలల హక్కులు ఉల్లంఘిస్తే ఏ విధంగా శిక్షార్హులవుతారో వివరించాలన్నారు. సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి పర్వీన్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ సంపత్, సఖి కేంద్రం అడ్మిన్ లక్ష్మి పాల్గొన్నారు.
ఆశ్రమంలో ఆకస్మిక తనిఖీ
కిసాన్‌నగర్‌లోని ప్రభుత్వ వృద్ధులు, దివ్యాంగుల ఆశ్రమాన్ని కలెక్టర్ చిత్రామిశ్రా మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. వృద్ధుల నివాస గదులు, వంటగది, తాగునీటి వసతి, టాయిలెట్లను పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులతో ముచ్చటించారు. భోజనం, వసతిలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారికి ట్రై సైకిల్ మరమ్మతులు చేయించాలని, చేతి కర్రలు అందజేయాలని దివ్యాంగులశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సూపరింటెండెంట్ నర్మద, వార్డెన్ రాధిక ఉన్నారు.


