సహకార ఎన్నికలు ఎప్పుడో ?
కొత్త మండలాలకు సంఘాలు
ఇన్‌చార్జి అధికారుల పాలనలో సొసైటీలు
గతేడాది డిసెంబర్‌లో ముగిసిన పదవీకాలం
జిల్లాలో 24 సహకార సంఘాలు
60వేల మందికిపైగా రైతులు
ఏడాది క్రితమే ముగిసిన పదవీకాలం
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఇన్‌చార్జి అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం అధికారులకు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇన్‌చార్జి అధికారుల పాలనతో రైతులకు సరైన సేవలు అందడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎన్నికలు ముగిసి, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారని రైతులు అభిప్రాయపడుతున్నారు. పాలకవర్గాలు ఉన్నప్పుడే యూరియా, విత్తనాలు, రుణాలు వంటి సేవలకు ఆటంకం లేకుండా అందుతాయని వారు పేర్కొంటున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 60వేలకు పైగా రైతులు వాటాధనం కలిగి ఉన్నారు.
ఇన్‌చార్జి అధికారులకు ఇబ్బందులు
జిల్లాలో సహకార ఎన్నికలు 2020 ఫిబ్రవరిలో జరిగాయి. కొలువుదీరిన పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్లు గడిచిపోయాయి. దీంతో ప్రభుత్వం ఎన్నికలకు పోకుండా ఆరు నెలలపాటు వారి పదవీకాలం పొడగించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల పదవీకాలం ముగియగా, 2025 ఆగస్టు వరకు ఒకసారి, అనంతరం మరో ఆరునెలలు పొడగించింది. డిసెంబర్ 19న పాలకవర్గాలను తొలగించి ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. రెండు నెలలుగా అటు మాతృసంస్థలలో విధులు నిర్వర్తిస్తూ ఇటు ఇన్‌చార్జి సేవలను అందిస్తున్నారు. ఒక్కో అధికారికి నాలుగు సహకార సంఘాల బాధ్యతలను అప్పగించారు.
రబీలో సమస్యలపై స్పందన ఏదీ..
ప్రస్తుతం రబీ సీజన్ నడుస్తోంది. ఎరువులు, యూరియా విత్తనాల సరఫరాపై సహకార ఉద్యోగులు, సిబ్బందికి సరైన మార్గనిర్దేశం చేసే వారులేరని రైతులు అంటున్నారు. మరోవైపు రుణాల రికవరీ వెనుకబడిందని తెలుస్తోంది. రుణాల మంజూరు, ఇతర సేవలు మందగించాయని సంఘ సభ్యులైన రైతులు పేర్కొన్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలపై సమీక్షించే వారు లేరు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా సింగిల్‌విండోలకు నామినేటెడ్ ద్వారా పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు పోకుండా నామినేషన్ పద్ధతి ద్వారా పాలకవర్గాలను నియమిస్తే న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంటుందనే చర్చ సాగుతోంది.
ఇప్పటికే ఉన్న సంఘాలను మరింత విస్తరిస్తారని ఆ శాఖ అధికారులు, రైతులు పేర్కొంటున్నారు. 20 ఏళ్ల క్రితం మండలానికి మూడు నుంచి నాలుగు సంఘాలు ఉండేవి. ఇప్పుడు కూడా సంఘాలను విస్తరించడంతోపాటు కొత్తగా ఏర్పడిన మండలాల్లో కూడా సహకార పరపతి సంఘాలను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అలా వీర్నపల్లి, రుద్రంగి, వేములవాడ అర్బన్ సంఘాలను ఏర్పాటు చేయవచ్చు. ఇల్లంతకుంటలో మరో రెండు సంఘాలు వచ్చే అవకాశం ఉంది.


