ఆధ్యాత్మికం.. గిరి ప్రదక్షిణం
అభివృద్ధికి వడివడిగా అడుగులు
స్వామివారి దర్శనానికి రాని భక్తులు
సగానికి పైగా వెనుదిరుగుతున్న వైనం
కొండగట్టు ఆలయ పరిధిలో చేపట్టాలన్న డిమాండ్
గిరిప్రదక్షిణలో భక్తులు
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం
మల్యాల: భక్తుల కొంగు బంగారం.. కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ప్రసిద్ధికి తోడు.. గిరి ప్రదక్షిణ మరింత ఆధ్యాత్మికతకు బాటలు వేస్తోంది. మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు గిరిప్రదక్షిణ ఆధ్యాత్మిక కార్యక్రమం రోజురోజుకూ ప్రాచుర్యం పొందుతోంది. ప్రతి పౌర్ణమికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రహదారి అభివృద్ధికి కూడా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. గిరి ప్రదక్షిణ చేసేవారు కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకోవాలన్న నియమం లేకపోవడంతో సగం మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్తుండడంపై కొందరు భక్తులు ఆక్షేపిస్తున్నారు. అదే సమయంలో కొండగట్టు ఆలయం ఆధ్వర్యంలోనే గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
ప్రతిపౌర్ణమికి వేలాదిమంది
కొండగట్టు ఆంజనేయస్వామి గిరి ప్రదక్షిణ రోజురోజుకూ ప్రాచుర్యం పొందుతుండటంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రతి పౌర్ణమికి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆలయానికి అనుబంధం లేకుండా గతేడాది హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ యాత్రను చిలుకూరి బాలాజీ అర్చకులే ప్రారంభిస్తున్నారు.
ఆలయ ప్రాశస్త్యంపై గిరి ప్రదక్షిణ ప్రభావం
భక్తుల గిరి ప్రదక్షిణతో కొండగట్టు ఆలయ ప్రాశస్త్యం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. అయితే స్వామివారిని దర్శించుకోవాలనే నియమం లేకపోవడంతో భవిష్యత్‌లో ఆలయ ప్రాశస్త్యంపై ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి దిగువ కొండగట్టులోని జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ప్రారంభించి.. అక్కడే ముగించడంతో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. గిరి ప్రదక్షిణ కొండగట్టు ఆలయానికి సంబంధం లేకుండా కొనసాగిస్తే భవిష్యత్‌లో ఆలయ ప్రాశస్త్యం, అంజన్న భక్తుల మనోభావాలపై ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్వామివారి భక్తుల ఆక్షేపణ
కొండగట్టు ఆలయానికి సంబంధం లేకుండా గిరి ప్రదక్షిణ కార్యక్రమం కొనసాగుతుండటాన్ని ఆంజనేయస్వామి భక్తులు ఆక్షేపిస్తున్నారు. గిరి ప్రదక్షిణలో సుమారు ప్రతి పౌర్ణమికి వేయి మందికిపైగా పాల్గొంటున్నా.. వారిలో స్వామివారి దర్శనానికి వెళ్లేవారి సంఖ్య మూడోవంతు కూడా లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకునేలా కార్యక్రమాన్ని రూపొందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వైజంక్షన్ వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభంతో మేలు..
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని వైజంక్షన్ వద్ద గిరి ప్రదక్షిణను ఆలయ అర్చకులు ప్రారంభించడం ద్వారా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని.. స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. దిగువ కొండగట్టులో గిరి ప్రదక్షిణ ప్రారంభించడంతో ఆలయ సమీపం నుంచి ఆరు కిలోమీటర్లు కాలినడక గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరోసారి మూడు కిలోమీటర్ల దూరంలోని స్వామివారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.
గిరి ప్రదక్షిణ..ఆధ్యాత్మికతకు బాట..
గిరి ప్రదక్షిణ ప్రజల్లో మరింత ఆధ్యాత్మికత పెంపొందించేందుకు తోడ్పాటునందిస్తోంది. రోజురోజుకూ గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో రహదారి అభివృద్ధికి ఇటీవల కలెక్టర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఆధ్యాత్మికం.. గిరి ప్రదక్షిణం


