పోలింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్
కొత్తపల్లి(కరీంనగర్): జిల్లాలోని మున్సిపాలిటీలకు ఈ నెల 11న జరిగే ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఇన్‌చార్జి ఎస్‌ఈ వడ్లకొండ గంగాధర్ ఆదేశించారు. కరీంనగర్ సర్కిల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, డీటీఆర్‌ల వద్ద సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా గురించి నివేదిక తయారు చేయాలన్నారు. 33 కేవీ, 11 కేవీ లైన్లు ఓవర్ లోడ్ అయ్యే అవకాశం ఉన్నచోట కొత్త లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాబాట కార్యక్రమాలన్నీ మంగళవారం, శుక్రవారం తమ సెక్షన్ పరిధిలోని సిబ్బందితో నిర్వహించి అక్కడి సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. 1912 నంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని తెలిపారు. డీఈలు కె.ఉపేందర్, జంపాల రాజం, లక్ష్మారెడ్డి, తిరుపతి, చంద్రమౌళి, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్, ఏవోలు, ఏఏవోలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


