ఉన్నత చదువుకు ‘అంబేడ్కర్ విద్యానిధి’
అర్హులెవరంటే..
● దళిత విద్యార్థులకు చక్కని అవకాశం
● రూ.20లక్షల వరకు రుణం పొందే చాన్స్
● పది దేశాల్లో చదివేందుకు ప్రాధాన్యం
కరీంనగర్‌టౌన్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం ఓ వరంగా మారింది. చదువుపై శ్రద్ధాశక్తులు ఉండి చేతిలో డబ్బులు లేని పేద విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయమందిస్తోంది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం కింద గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 210 మంది విద్యార్థులకే సాయమందించింది. ఇటీవల ప్రభుత్వం ఏటా 500 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. అభ్యర్థులు చదివే కోర్సు ఫీజులను బట్టి గరిష్టంగా రూ.20లక్షల వరకు ఆర్థిక సాయమందిస్తోంది.
ప్రతిభ ఆధారంగా ఎంపిక
తెలంగాణ ఈ–పాస్ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థి వివరాలను పూరించి సంబంధిత ధ్రువపత్రాలను జేపీజీ ఫార్మాట్‌లో జతపర్చాలి. రాష్ట్రస్థాయిలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికై న వారికి విదేశీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రవేశ లేఖ ఆధారంగా రూ.20లక్షల వరకు ఆర్థిక సాయమందజేస్తారు. కోర్సులో చేరిన వారు మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరంలోకి ప్రవేశించినట్లు ధ్రువపత్రాలు పంపిస్తేనే ఫీజుకు సంబంధించిన సాయం విడుదల చేస్తారు. అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించకుంటే సాయం నిలిచిపోతుంది.
కావాల్సిన ధ్రువపత్రాలు
పాస్‌పోర్టు సైజ్ ఫొటో, బోనాఫైడ్ సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డు, స్థానికత ఽధ్రువపత్రం, పదోతరగతి మెమో, చివరి కోర్సు మార్కుల మెమో, బదిలీ సర్టిఫికెట్, జీఆర్‌ఈ/జీమ్యాట్/ఇతర స్కోర్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశ లేఖ, పాస్‌పోర్టు కాపీ.
కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల్లోపు ఉండాలి.
ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
జీఆర్‌ఈ/జీమ్యాట్‌లో అర్హత మార్కులు సాధించాలి.
ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టులో ప్రతిభ.
ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి మాత్రమే అర్హులు.
దరఖాస్తు గడువు మార్చి 31.
అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో చదువుకోవచ్చు.


