ఓటిక్కడ.. కేంద్రం అక్కడ
కరీంనగర్‌రూరల్: మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ఓటర్లకు భారంగా మారింది. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలంటే సుమారు 5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటరు జాబితా ప్రకారం సమీపంలోని పోలింగ్‌స్టేషన్‌లో ఓటు వేసే సౌకర్యం కల్పించాల్సి ఉండగా అధికారులు దూరంగా ఉన్న మరో స్టేషన్‌ను కేటాయించడం వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ అధికారులకు స్థానిక నాయకులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఓటర్లకు దూరభారంగా మారింది. కరీంనగర్ కార్పొరేషన్‌లో దుర్శేడ్, గోపాల్‌పూర్ గ్రామాలను విలీనం చేసి 4,5వ డివిజన్లుగా విభజించారు. 4వ డివిజన్‌లోని గోపాల్‌పూర్ ఓటర్లకు సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని విస్మరించి 2 కిలోమీటర్ల దూరంలోని దుర్శేడ్ జెడ్పీ స్కూల్‌లో పోలింగ్ కేంద్రం కేంటాయించారు. అలాగే దుర్శేడ్‌లోని సుమారు 760మంది ఓటర్లకు స్థానిక జెడ్పీ స్కూల్‌లో కేంద్రం కేటాయించకుండా గోపాల్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో కేటాయించారు. దీంతో రెండు గ్రామాల ఓటర్లు ఓటేసేందుకు నాలుగైదు కిలోమీటర్లు దూరం పోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా, 5వ డివిజన్ పరిధిలోని దుర్శేడ్‌కు చెందిన సుమారు 500 మంది ఓటర్లకు సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో కాకుండా దాదాపు 5కిలో మీటర్ల దూరంలోని బొమ్మకల్ రజ్వీచమన్‌లో ఐక్యుర జెమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను కేటాయించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటువేసేందుకు ముందుకువచ్చే అవకాశం లేకపోవడంతో ప్రధానపార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా డివిజన్ల పరిధిలోని ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


