నేను.. నా పోరాటం | - | Sakshi
Sakshi News home page

నేను.. నా పోరాటం

Feb 9 2026 7:51 AM | Updated on Feb 9 2026 7:51 AM

నేను.

నేను.. నా పోరాటం

సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట: ‘విప్లవ పార్టీలో దళ సభ్యుడిగా మొదలైన నా ప్రయాణం గడ్చిరోలికి చేరింది. ఇస్రోజీవాడి నుంచి గడ్చిరోలి వరకు విప్లవ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు.. అంతకు మించి సంతృప్తి.. కాలక్రమంలో గడ్చిరోలి నుంచి.. అబూజ్‌మడ్‌ అడవులకు చేరి.. అక్కడే గిరిజనుల హక్కుల కోసం పోరాడిన వైనం.. తాడిత, పీడిత ప్రజల పక్షాన నిలిచిన ఘటనలకు సాక్ష్యం చందర్‌ అలియాస్‌ పడ్కల్‌ స్వామి అలియాస్‌ ప్రభాకర్‌ జీవిత చరిత్ర. నక్సలైట్‌ ఉద్యమంలో తొలి ఆత్మకథ చందర్‌దే కావడం విశేషం. ఎన్‌కౌంటర్‌కు ముందు తాను రాసుకున్న విప్లవ ఆత్మకథ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది’. ఈనెల 5న ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సీపీఐ(ఎంఎల్‌) మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్‌– మహారాష్ట్ర వెస్ట్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్‌రావు(57) అలియాస్‌ పడ్కల్‌ స్వామి అలియాస్‌ ప్రభాకర్‌ మృతదేహం కామారెడ్డి జిల్లాలోని ఆయన సొంత ఊరు ఇస్రోజివాడికి ఆదివారం తీసుకొచ్చారు. ఆయన అంత్యక్రియలకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు మాజీ నక్సలైట్లు హాజరయ్యారు. ఎర్రజెండాలు, విప్లవ నినాదాలు, పాటలతో ఆయన అంత్యక్రియలు సాగాయి.

ప్రభాకర్‌ ఆత్మకథలోని కొన్ని ముఖ్య ఘటనలు..

● మావోయిస్టు ఉద్యమకారుడు స్వామి తన ఆత్మకథలో పలు ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించారు. ఇస్రోజీవాడిలో జరిగిన ఒక సంఘటన చందర్‌ను అడవిబాట పట్టేలా చేసింది. గ్రామంలోని మాలి పటేల్‌, ఇతర పెత్తందార్లకు వ్యతిరేకంగా చేస్తున్న విప్లవ కార్యకలాపాలకు చెక్‌ పెట్టాలని పోలీసులతో గ్రామస్తులను పోలీస్‌స్టేషన్‌లో బంధించారు. పోలీసులకు లొంగిపోవాలని, లేదా అడవిబాట పట్టాలని సభ్యులపై ఒత్తిడి తేగా.. ఆ కుట్రను ఛేదించారు.

● 1991లో పూర్తిస్థాయిలో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిపోయారు. 1991 నుంచి 33 నెలలపాటు కామారెడ్డి దళంలో పనిచేశారు. తర్వాత దళ అవసరం రీత్యా సిర్నాపల్లి దళంలో సభ్యుడికి చేరి, కమాండర్‌, డివిజన్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు.

● రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ఎస్సైగా పని చేస్తున్న శ్రీనివాస్‌రావును 1998లో మందుపాతర పేల్చి చంపిన ఘటనలో ముగ్గురితో కలిసి తాను అంబూష్‌లో పాల్గొన్నారు. నిజానికి ఈ ఘటన రాంచందర్‌ చేసినట్లు ప్రచారం జరగ్గా.. ఆ రాంచందర్‌ వన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. కానీ, లోకేటి చందర్‌రావు అలియాస్‌ స్వామి నాయకత్వంలోనే ఈ ఘటన జరిగినట్లు ఆయన ఆత్మకథలో పేర్కొన్నారు.

● 1999లో కోనరావుపేట మండలం మరిమడ్లలో పోలీసులను గుర్తించడంలో విఫలమైన తమ సెంట్రీ విఫలమయ్యాడని, దీంతో పోలీసులు సమీపించగానే ముందుగా కాల్పులు జరపడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రాణనష్టం, కిట్‌బ్యాగుల నష్టం ఏమీ కాలేదని, మెదక్‌ జిల్లా పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన ఘటనను కళ్లకు కట్టినట్లు వివరించారు.

● 1999 నుంచి 2000 వరకు కామారెడ్డి ఏరియాకు ఇన్‌చార్జిగా, 2000 నుంచి 2003 వరకు సిరిసిల్ల ఏరియాకు జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ నిర్ణయం మేరకు 2003లో దండకారణ్యం వెళ్లారు. అక్కడ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2006లో ఎజేడ్సీలోకి, 2011లో దక్షిణ సబ్‌ జోన్‌ నుంచి పశ్చిమ సబ్‌ జోన్‌కు వెళ్లారు. ఇక్కడే 2020 వరకు సబ్‌ జోనల్‌ బ్యూరో మెంబర్‌గా, పశ్చిమ సబ్‌ జోనల్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా, ఉత్తర గడ్చిరోలి డివిజన్‌కు సబ్‌ జోనల్‌ బ్యూరో నుంచి ఇన్‌చార్జిగా పనిచేశారు. 2020 నుంచి 2024 వరకు పశ్చిమ సబ్‌ జోనల్‌ బ్యూరో ప్రభారిగా పనిచేశారు.

● ఉమ్మడి నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలో ఆయన పని చేసిన కాలంలో జరిగిన ఘటనలు, నిజామాబాద్‌ జిల్లా జాక్రాన్‌పల్లి మండలం పడ్కల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను, తన 35 ఏళ్ల అజ్ఞాత జీవితం, భార్యాపిల్లల జీవనం, సాయుధ పోరాటం, పేదల ప్రజలపై దండకారణ్యంలో చేసిన ప్రజాపోరాటాలను తన ఆత్మకథలో సమగ్రంగా వివరించారు.

కొసా దాదా అంత్యక్రియలకు హాజరైన స్వామి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెలో సెప్టెంబరు 25న జరిగిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కొసా దాదా అలియాస్‌ కడారి సత్యనారాయణరెడ్డి అంత్యక్రియల్లో స్వామి పాల్గొని కడసారి చూపులు చూసుకున్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో సెప్టెంబరు 21న పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కొసా, ఆయనతో పాటు మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్‌ వికల్ప్‌ మరణించారు. సెప్టెంబరు 25న గోపాల్‌రావుపల్లెలో కొసా దాదా అంత్యక్రియల్లో అంత్యంత రహస్యంగా స్వామి పాల్గొని అగ్రనేతకు నివాళి అర్పించడం విశేషం. పోలీసుల నిఘా మధ్య, ఆయన గోపాల్‌రావుపల్లెకు చేరుకుని అంత్యక్రియల్లో ఎవరూ గుర్తించకుండా పాల్గొని వెళ్లడం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

పోరాట క్షేత్రంగా ఆత్మకథ

పోరాట క్షేత్రంగా తన కళ్ల ముందే చనిపోయిన సహచరుల పేర్లు, వారి కులాలు, నేపథ్యాలను స్వామి గుర్తు పెట్టుకుని ఆత్మకథలో రాశారు. ముఖ్యంగా తన గార్డుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన మానస గురించి రాసిన తీరు ఆయన సహచర ప్రేమను చాటుతోంది. కరుడుగట్టిన విప్లవకారుడి లోపల కూడా ఒక సున్నితమైన మనిషి ఉంటాడని స్వామి ఆత్మకథ స్పష్టం చేస్తుంది.

కన్నీటి వీడ్కోలు

మా ఊరు ఇస్రోజివాడి అంటూ.. స్వామి తన అజ్ఞాత జీవితాన్ని ఆవిష్కరించారు. తల్లి పేరు లోకేటి కిష్టాబాయి, తండ్రి వీరన్న, నలుగురు సంతానంలో నేను నాలుగో వాడిని. మా పెద్ద అక్క గంగబాయి, ఆ తరువాత ఇద్దరు అన్నలు రాజేశ్వర్‌రావు, మానిక్‌రావు, నేను చిన్నోడిని చందర్‌రావును. నేను 1969లో జన్మించాను. అంటూ.. తాను 6వ తరగతి పాస్‌ అయ్యాయని.. రాడికల్‌ యూత్‌ లీగ్‌(ఆర్‌వైఎల్‌)లో పని చేస్తూ.. మావోయిస్టు ఉద్యమంలో చేరిన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్‌కు వచ్చిన హెలీకాప్టర్‌ను కూల్చడం నుంచి మొదలు పెడితే.. అనేక హింసాత్మక ఘటనలను ఉటంకించారు. 35 ఏళ్ల పాటు సాయుధ పోరాటం సాగించిన స్వామి తుదకు ఎన్‌కౌంటర్‌లో అమరుడై.. సొంత ఊరికి చేరితే కన్నీటితో వీడ్కోలు పలికింది ఇస్రోజివాడి.

22 ఏళ్ల ప్రాయంలో అడవిబాట

దళ సభ్యుడిగా మొదలైన ప్రయాణం

ఎన్నెన్నో దాడులు.. యుద్ధరీతులు

ముందే ఆత్మకథలో ఆవిష్కరించిన స్వామి

సోషల్‌ మీడియాలో వైరల్‌

నేను.. నా పోరాటం1
1/1

నేను.. నా పోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement