ఓటరు మహాశయులారా
మాకు అగచాట్లెందుకు
కోల్‌సిటీ(రామగుండం): పొద్దున లేచించి మొదలు.. రాత్రి వరకూ గల్లీలన్నీ పాటలతో మార్మోగుతున్నాయి. మైకుల శబ్దం, వాహనాల గర్జన మధ్య శ్రీపలానా గుర్తుకే మన ఓటుశ్రీ అని వినిపించే జానపద పాటలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. వాటికి చిన్నారులు స్టెప్పులు వేస్తుంటే.. పెద్దలు చిరునవ్వుతో తలూపుతున్నారు. అయితే, అభ్యర్థుల పేర్లకన్నా ముందే ఓటర్ల చెవుల్లో నాటుకుపోయే స్వరాల వెనుక ఉన్నవారు ఎవరు? ఒక్క పాటతో గల్లీని కదిలించే ఆ గొంతులు ఎలా ఉంటాయి? ఎన్నికల రణరంగంలో వాహనాలపై తిరుగుతూ రాత్రింబవళ్లు స్వరం వినిపిస్తూ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసే గాయకుల కథ ఇదే. ఓటు రాజకీయాల మధ్య నడిచే కళాకారుల కనబడని ప్రయాణమిది. కళను కాపాడాలంటే కళాకారులను నిలబెట్టాల్సిందే అంటున్నారు. లేదంటే పాట మిగులుతుంది కానీ.. పాట పుట్టిన గొంతు కష్టాల్లోనే కరిగిపోతుంది.
మూడు దశాబ్దాలుగా కళనే శ్వాసగా, జీవనాధారంగా నమ్ముకున్నాడు. డప్పు ప్లేయర్‌గా, గాయకుడిగా, నృత్య మాస్టర్‌గా, రచయితగా తనదైన ముద్ర వేశాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి చైతన్య గీతాలు, ఉద్యమ గీతాలు అందించారు. అంబేడ్కర్ ఆశయాలను ప్రతిబింబించే బహుజన గీతాలు, ప్రజల్ని కదిలించే ప్రచార గీతాలు రచించి పాడారు. కళను నమ్ముకున్నా.. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించే ఆదాయం సమకూరడంలేదు. అవార్డులు, రివార్డులు వచ్చాయి. సన్మానాలు, సత్కారాలు జరిగాయి. అవి జీవనానికి భరోసా ఇవ్వలేకపోయాయి. – గాజుల రమేశ్, డప్పు కళాకారుడు, గోదావరిఖని
ఓటరు మహాశయులారా


