కాంగ్రెస్‌ వర్సెస్‌ మజ్లిస్‌ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వర్సెస్‌ మజ్లిస్‌

Feb 9 2026 7:49 AM | Updated on Feb 9 2026 7:49 AM

కాంగ్

కాంగ్రెస్‌ వర్సెస్‌ మజ్లిస్‌

ఎంఐఎం ఓట్లకు కాంగ్రెస్‌ గాలం బల్దియా పోరులో అనూహ్య పరిణామం సంప్రదాయ ఓటు బ్యాంకుపై హస్తం కన్ను ఎంఐఎం స్థానాల్లో బలమైన నేతలతో కాంగ్రెస్‌ పోటీ మజ్లిస్‌కు తప్పని రెబల్స్‌ బెడద

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

రీంనగర్‌ బల్దియా పోరు అనూహ్య మలుపు తిరుగుతోంది. ఎన్నికల్లో గెలిచి కింగ్‌మేకర్‌గా నిలుస్తామని ఉవ్విళ్లూరుతున్న మజ్లిస్‌కు పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. మారుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌ వ్యూహాలకు గాలిపటం ఎదురీదుతోంది. మజ్లిస్‌ ఆశలు పెట్టుకొన్న ముస్లిం ఓట్లను గంపగుత్తగా చేజిక్కించుకొనేందుకు కాంగ్రెస్‌ పథకం వేస్తోంది. గతంలో పలుమార్లు కలిసి పీఠాన్ని నడిపిన గాలిపటానికి ఈసారి చేతి సాయం దూరమయ్యేలా కనిపిస్తోంది. మిత్రపక్షంతో స్నేహంగా ఉంటూనే సొంతంగా మెజారిటీ సాధించాలన్న కాంగ్రెస్‌ పట్టుదల ఆచరణలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి ఎంఐఎంలోని పలువురు కీలక నేతలు బీఆర్‌ఎస్‌లో చేరడం ప్రతికూలాంశంగా మారింది. ఓ వైపు కాంగ్రెస్‌ సొంత బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు తిరుగుబాటుదార్లు బీఆర్‌ఎస్‌లో చేరి పోటీ చేయడంతో ముస్లిం ఓట్లు గంపగుత్తలా పడే మార్గాలు కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం అవసరాన్ని బట్టి పొత్తులకు వెళ్లేలా కాంగ్రెస్‌ వ్యూహం కనిపిస్తోంది.

విజేతగా నిలిచేనా?

ప్రతీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు మజ్లిస్‌ చాంపియన్‌గా ఉంటూ వస్తోంది. ఎన్నిక ఏదైనా ఎంఐఎం వైపే ముస్లిం సమాజం నిలుస్తుందనే భావన ఉంటుంది. నగరపాలకసంస్థ ఎన్నికల్లో గతంలో పలుమార్లు ఇది రుజువైంది కూడా. మొదటి కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏకంగా 50 డివిజన్లకు గాను తొమ్మిది స్థానాలు గెలుచుకొని డిప్యూటీ మేయర్‌ను సొంతం చేసుకుని సత్తా చాటింది. పైగా ఎంఐఎం మద్దతుతోనే అప్పుడు మేయర్‌ అభ్యర్థి చివరినిమిషంలో మారారనే ప్రచారం సాగింది. తరువాత జరిగిన రెండు నగరపాలకసంస్థ ఎన్నికల్లో ఎంఐఎం సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గడమే అందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో 60 డివిజన్లకు కేవలం ఆరు స్థానాలకే ఎంఐఎం పరిమితమైంది.

ముస్లిం ఓట్లకు కాంగ్రెస్‌ గాలం

పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచిన ఎంఐఎం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తమ వైఖరినీ మార్చుకుంది. ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బాసటగా నిలుస్తూ వస్తోంది. కరీంనగర్‌ బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం కనీసం పది నుంచి పన్నెండు స్థానాలు గెలుచుకొని, మేయర్‌ ఎన్నికల్లో చక్రం తిప్పుతుందని అంతా భావించారు. బయట ప్రచారం అదే సాగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఓటు బ్యాంకును పెంచుకొనే దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేస్తోంది. తన సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ అయిన ముస్లిం, దళితుల ఓట్లను ఆకర్షిస్తోంది. సహజంగా ఎంఐఎం బలంగా ఉన్న చోట కాంగ్రెస్‌ బలహీన అభ్యర్థులను పోటీలో నిలుపుతుంది. ఈసారి ఎన్నికల్లో కొన్ని చోట్ల ఎంఐఎంకు కాంగ్రెస్‌ అభ్యర్థుల నుంచి గట్టిపోటీ నెలకొంది. ఎంఐఎం మద్దతు అవసరం పడకుండా, నేరుగా ముస్లిం ఓట్లు కొల్లగొట్టడానికి కాంగ్రెస్‌ నేతలు కరీంనగర్‌లో పావులు కదుపుతున్నారు. ఎంఐఎంకు ఓటు వేయడం ద్వారా బీజేపీకి పరోక్షంగా లాభం జరుగుతుందనే ఆలోచనకు వస్తున్న ముస్లిం మేధావులను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఎంఐఎం నుంచి విడిపోయిన ఓ బలమైన వర్గం బీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి దిగడం ఎంఐఎం గడ్డు పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఎన్నికల షెడ్యూల్‌ నాటికి ఉన్న పరిస్థితి పోలింగ్‌ నాటికి ఎంఐఎంకు లేకుండా పోవడం ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పరిణామం.

కాంగ్రెస్‌ వర్సెస్‌ మజ్లిస్‌1
1/1

కాంగ్రెస్‌ వర్సెస్‌ మజ్లిస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement