● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్/తిమ్మాపూర్/చొప్పదండి: కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే నగర రూపురేఖలు మారుస్తానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లో విజయసంకల్పయాత్రతో పాటు అలుగునూరు, సదాశివపల్లిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అలుగునూరు తలాపునే మానేరు ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు కరువయ్యారన్నారు. మేయర్ పీఠం బీజేపీకి అప్పగిస్తే 24 గంటల తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. సదాశివపల్లి, హౌసింగ్ బోర్డు ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో భారీ ఎత్తున ‘విజయ సంకల్ప ర్యాలీ’ నిర్వహించారు. బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి, మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశీష్ షెల్లార్, మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్‌కౌర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే టాక్స్‌లు పెంచుతారు
కేంద్రం నుంచి నిధులు ఇచ్చేది మోడీ అని, అవి తెచ్చేది బండి అని, అలాంటప్పుడు కాంగ్రెస్‌కు ఓటెందుకు వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చొప్పదండిలోని మార్కెట్‌చౌరస్తాలో ఆదివారం జరిగిన బీజేపీ కార్నర్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు, చొప్పదండి, అన్ని మున్సిపాలిటీలకు నిధులిచ్చేది, అభివృద్ధి చేసేది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వమని తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఓటేందుకు వేయాలని ప్రశ్నించారు. పదేళ్లపాలనలో ప్రభుత్వ స్థలాలతో పాటు, ప్రజల జాగాలను కబ్జా చేసి అరాచకలు చేసిన బీఆర్‌ఎస్ నేతలు ఏం ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే కేంద్రం నిధులతోనేనన్నారు. చొప్పదండికి అమృత్ 2 ద్వారా రూ.36.30 కోట్లు, 14,15 ఆర్థిక సంఘాల ద్వారా రూ.5.57 కోట్లు, స్వచ్ఛ భారత్ ద్వారా రూ.42లక్షలు కేంద్రం ఇచ్చిందన్నారు. స్వనిధి ద్వారా 1,611 మంది రూ.2.94కోట్లు లబ్ధి పొందారని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


