మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట భద్రత
కరీంనగర్‌క్రైం/కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఆదివారం కమిషనరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా సాగేందుకు ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 4 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పనిచేస్తున్నాయన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌లోని 66 వార్డులను వివిధ క్లస్టర్లుగా విభజించామని, ఏదైనా సమస్య తలెత్తితే నిమిషాల్లో స్పందించేలా పెట్రోలింగ్ పార్టీలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. 25శాతం కేంద్రాలను ‘క్రిటికల్’గా గుర్తించామని, అక్కడ వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ హాల్‌ను, పోలింగ్ స్టేషన్‌ను బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద లైటింగ్, ఫర్నిచర్, తాగు నీటి వసతి, రవాణా కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు బ్యాలెట్ లెక్కింపు కోసం ట్రేలు, ర్యాకులు, టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీ వెంకటరమణ, సీఐలు సృజన్ రెడ్డి, రాంచందర్ రావు, తిరుమల్ పాల్గొన్నారు.


