కరీంనగర్
డంప్‌యార్డు తరలిస్తాం
సోనియా సేనానిగా బల్దియాను గెలిపించుకుంటా
డంపింగ్ యార్డ్ సమస్యకు త్వరలోనే పరిష్కారం
నగరంలో ఇంటింటికీ కాంగ్రెస్ పథకాల లబ్ధిదారులు
రెండేళ్లలో కరీంనగర్‌కు రూ.1489 కోట్లిచ్చాం
నెలలో ఔటర్ రింగ్ రోడ్డుకు డీపీఆర్, భూసేకరణ
మానేరు వద్ద అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియానికి సీఎం ఆదేశాలు
స్మార్ట్ సిటీ నిధులు మింగినవారి భరతం పడతాం
కార్పొరేషన్‌లో ఎలాంటి అనుమతైనా రెండురోజుల్లో ఇస్తాం
కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు
మేటి నగరంగా
కరీంనగర్‌లోని మానేరు డ్యాం వద్ద హుస్సేనసాగర్ తరహాలో అంబేడ్కర్ విగ్రహం, మ్యూజియం ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. మానేరు రివర్‌ఫ్రంట్, తీగల వంతెనలో సాంకేతిక లోపాలపై అధ్యయనం చేసి నివేదిక ఆధారంగా లోపాలు సరిచేస్తాం. కేబుల్ బ్రిడ్జిపై డైనమిక్ లైటింగ్‌ను పునరుద్ధరిస్తాం సుడా మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా నిర్మించిన తలచిన కరీంనగర్ ఔటర్ రింగురోడ్డుకు నెలరోజుల్లో భూసేకరణ, డీపీఆర్‌లు సిద్ధం చేయాలని ఆర్డీవోను సీఎం ఆదేశించారు. ఈ రోడ్డుతో కరీంనగర్ పారిశ్రామిక, ఆర్థిక ముఖచిత్రం మారనుంది.
నగరంలో బల్దియా రూ.వందల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన భవనాల్లో దళిత, బీసీ, మైనార్టీ మహిళలు, యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఎంఎన్‌సీ కంపెనీల సాయంతో ప్రారంభించాలని సీఎం ఆదేశించా రు. పేదలందరికీ రెండో విడదలో సొంత జాగాతో ఇందిర మ్మ ఇళ్లు ఇవ్వాలని చెప్పారు. హైదరాబాద్‌కు రైలు సదుపా యం కల్పిస్తాం. పెద్దపల్లి మీదుగా ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే, కేంద్రరైల్వేశాఖమంత్రులకు లేఖలు రాయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తిరుపతి ఎక్స్‌ప్రెస్‌తోపాటు కాచిగూడ ఎక్స్‌ప్రెస్, డె మూ రైలు సర్వీసులు కూడా కాంగ్రెస్ హయాంలో వేసినవే.
నిధుల కేటాయింపులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీకే)కు ప్రాధాన్యం కల్పించి.. అత్యాధునిక సదుపాయాలతో రాష్ట్రంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పేర్కొన్నారు. రెండేళ్లలోనే కార్పొరేషన్‌కు రూ.1489 కోట్లు కేటాయించామని, మరిన్ని నిధులు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. నగరంలోని 66 డివిజన్లలో ఇంటింటికీ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులున్నారని అవే తమను గెలిపిస్తాయన్నారు. సోనియా సైనికులుగా మున్సిపల్ ఎన్నికల్లో 40కి పైచిలుకు సీట్లు గెలుచుకుని బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరేసి, సీఎంకు బహుమతిగా ఇస్తామన్నారు. పదేళ్లలో బల్దియాలో జరిగిన అక్రమాలపై అధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణ చేయించి, అవినీతిపరుల భరతం పడతామని స్పష్టంచేశారు. కరీంనగర్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించి బీసీసీఐకి ఇక్కడి యువత ఆడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. –సాక్షిప్రతినిధి,కరీంనగర్
గత పదేళ్లలో స్మార్ట్‌సిటీ పేరిట రూ.వందల కోట్లు దోచుకున్నారు. శివారు, పేద, దళిత, మైనార్టీల కాలనీల్లో కనీస వసతులు కల్పించలేదు. బల్దియాలో కాంగ్రెస్ గద్దెనెక్కాక అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తాం. అవినీతి అనకొండలను బండి సంజయ్ బీజేపీలో చేర్చుకోవడం సరికాదు. కొందరు బెయిల్ నుంచి వచ్చి బీఆర్‌ఎస్ టికెట్ల మీద పోటీ చేస్తున్నారు. వీరిని ప్రజలు తరిమి కొడతారు. నగరంలో ఇండ్లు కట్టుకున్న సామాన్యుడిని ఇంతకాలం కార్పొరేటర్లే దోచుకున్నారు. డబ్బుల్వికుంటే ఇళ్లు కూల్చిన ఉదంతాలు చూశాం. మా పార్టీ బల్దియా పగ్గాలు చేపట్టాక ఎలాంటి అనుమతి అయినా పారదర్శకంగా రెండు రోజుల్లో వస్తుంది. బల్దియా ఉద్యోగుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతాం. వారిపై పని ఒత్తిడి తగ్గేలా బల్దియాలో అదనంగా మరో 700 మందిని చేర్చుకుంటాం.
నగరంలో పదేళ్లుగా దాదాపు 2 లక్షల మందిని డంపింగ్ యార్డు సమస్య వేధిస్తోంది. సీఎం రేవంత్ దీనికి పరిష్కారంగా హుజురాబాద్ సమీపంలో ఆధునిక డంపింగ్‌యార్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ యార్డు నుంచి ఎరువు, విద్యుదుత్పత్తితో ఆదాయం సమకూరనుంది. నగరంలో దాదాపు 3.50 లక్షల ఓటర్లున్నారు. మా సంక్షేమ పథకాలు సన్నబియ్యం, ఉచిత ఆర్టీసీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500లకే గ్యాస్ సిలిండర్లు, మహిళా సంఘాల రుణాలు ఇలా ఏదో రకంగా మా పార్టీ ప్రయోజనాలు పొందిన లబ్ధిదారులున్నారు. వారంతా బల్దియాలో మాకు ఓటేస్తారు.
కరీంనగర్


