అంగన్‌వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
రామడుగు: ప్రతి గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం తిర్మలాపూర్‌లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శుక్రవారం సభ ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. గర్భిణులు, బాలింతలు, కిషోరబాలికలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలను వివరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సర్పంచ్ మోడీ రవీందర్ కలెక్టర్‌కు విన్నవించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీడబ్ల్యూవో సరస్వతి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సుధారాణి, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
గంగాధర: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, పాఠశాలల నిర్వాహణ తీరు బాగుందని, ఉపాధ్యాయులు మరింత ప్రయత్నిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కె.సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గంగాధర మండలంలోని బూర్గుపల్లి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు పదోతరగతిపైనే కాకుండా 6వ తరగతి నుంచి కూడా దృష్టి సారించాలన్నారు. అనంతరం ప్రధానమంత్రి పరీక్షపే చర్చ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించారు. పదోతరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, సమస్యలు తెలుసుకున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, సైన్స్‌ల్యాబ్, గ్రంథాలయం, విటమిన్ గార్డెన్, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులు సోషల్ మీడియా, సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పాఠశాల రికార్డులు పరిశీలించారు. హెచ్‌ఎంలు ఎలిగేటి మల్లికార్జున్, లక్ష్మి, ఉపాధ్యాయులు నగేశ్, లక్ష్మిరాజం, జగదీశ్వర్‌రెడ్డి, భూమయ్య, మంజుల, రాజమల్లయ్య, ప్రవీణలత, మల్లేశం పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ కార్డులకు దరఖాస్తులు ఆహ్వానం
కరీంనగర్ అర్బన్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి ఈ నెల 28తో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయి కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారికి సమర్పించాలని సూచించారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు ఈ నెల 9 నుంచి సమాచార పౌరసంబంధాలశాఖ అధికారిక వెబ్‌సైట్ http://ipr. telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన జర్నలిస్టులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
8న కరీంనగర్‌లో ఐటీ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం
కరీంనగర్: జిల్లాలోని యువతకు ఐటీరంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కోడింగ్ ట్యూటర్ ఆధ్వర్యంలో ఐటీ జాబ్‌మేళా, ఇంటర్న్‌షిష్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనెల 8న ఆదివారం ఉదయం 10 గంటలకు, కరీంనగర్‌లోని శ్వేత హోటల్‌లో కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఐటీ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలు, కంపెనీలు ఏ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత యువత ఎలా సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టవచ్చు.. ఇంటర్న్‌షిప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయనే విషయాలను ఫణిరాజ్ జాలిగామ వివరించనున్నారు. ఈ కార్యక్రమం డిగ్రీ/ఇంజినీరింగ్ పూర్తిచేసిన, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 89888 87333 నంబర్‌కి ఫోన్‌చేసి తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికే ప్రవేశం కల్పించబడుతుందని నిర్వాహకులు ఈ సందర్భంగా సూచించారు.
అంగన్‌వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి


