అమ్మకు అక్షర వికాసం | - | Sakshi
Sakshi News home page

అమ్మకు అక్షర వికాసం

Feb 7 2026 1:34 PM | Updated on Feb 7 2026 1:34 PM

అమ్మకు అక్షర వికాసం

అమ్మకు అక్షర వికాసం

గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామాల్లోని నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాయి. అక్షరాలు నేర్వని అతివలకు సులభ పద్ధతిలో చదవడం, రాయడం, అంకెలను గుర్తించడం, లెక్కలను నేర్పించడం కోసం ‘ఉల్లాస్‌’(అండర్‌ స్టాండింగ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ) అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 12 మండలాల్లో 411 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీరిలో లక్షకు పైగా సభ్యులు ఉన్నారు. దాదాపు 23,800 మంది నిరక్షరాస్యులైన మహిళా సభ్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి వివరాలను ఉల్లాస్‌ యాప్‌లో నమోదు చేశారు. వీరికి చదువు నేర్పించడానికి వలంటీర్లను గుర్తించారు. వలంటీర్లు నిరక్షరాస్యులైన మహిళలకు చదవడం, రాయడం నేర్పిస్తున్నారు. మార్చి నెల వరకు సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ఉల్లాస్‌ అమలు చేస్తున్నారు. మహిళా సభ్యులు విద్యావంతులైతే సంఘాలు మరింత పటిష్టంగా పనిచేస్తాయని, నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్కో వలంటీర్‌ పది మంది నిరక్షరాస్యులైన మహిళలకు చదువు చెప్పడం జరుగుతోంది. ఇంటింటా చదువు.. ఊరంతా వెలుగు.. అక్షర వికాసం పేరుతో పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాల్లో ఉన్న విషయాలను వలంటీర్లు, వీవోఏలు నిరక్షరాస్యులైన మహిళలకు నేర్పుతున్నారు. ఇప్పటికే అక్షరజ్ఞానం నేర్పించడానికి వలంటీర్లకు, వీవోఏలకు, వీవోల అధ్యక్ష, కార్యదర్శులతోపాటు సీసీలు, ఏపీఎంలకు మండలాలవారీగా శిక్షణనిచ్చారు. జిల్లా విద్యాశాఖ, వయోజన విద్య, డీఆర్‌డీవో విభాగాలు ఈ అక్షరజ్ఞాన కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సంఘాల్లోని మహిళలు ఇప్పటికే అక్షరాస్యులై ఉంటే.. టెన్త్‌, ఇంటర్‌ పూర్తి చేయని వారైతే వారిని ఓపెన్‌స్కూల్‌లో చేర్పించి పరీక్షలు రాయించే ఏర్పాట్లు చేస్తున్నారు.

‘ఉల్లాస్‌’తో విద్యాబోధన

మహిళా సంఘాల్లోని సభ్యుల అక్షరాస్యతే లక్ష్యం

జిల్లాలో 23 వేల మంది నిరక్షరాస్యుల గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement