అంబులెన్స్‌లోనే కేసు విచారణ
● ఫిర్యాది వృద్ధాప్యం.. పక్షవాతంతో ఇబ్బంది
● న్యాయమూర్తి ఫిర్యాది వద్దకు వచ్చిన వైనం
కరీంనగర్‌క్రైం: ఫిర్యాదుదారు వృద్ధాప్యంతోపాటు పక్షవాతంతో లేవలేని స్థితిలో ఉండడంతో న్యాయమూర్తి అంబులెన్స్‌లోకి వచ్చి వాంగ్మూలం స్వీకరించిన సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన అనువోజు రాజేశ్వరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. వారికి పెళ్లిళ్లు కావాటంతోపాటు ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగా మిగిలింది. తనని ఉద్యోగి అయిన కొడుకు అణువోజు వెంకటేశ్వర్లు పట్టించుకోకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న ఆమె ఆర్డీవో వద్ద కొడుకుపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును విచారించిన ఆర్డీవో వెంకటేశ్వర్లు నెలకు రూ.4వేలు పోషణ నిమిత్తం తల్లికి చెల్లించాలని తీర్పునిచ్చారు. కొడుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్న వృద్ధురాలు చిగురుమామిడి పోలీసులకు కొడుకుపై ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు కొడుకు వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రాగా ఫిర్యాది రాజేశ్వరీ సాక్ష్యం కోర్టు స్వీకరించాల్సి ఉంది. పక్షవాతం వచ్చి ఆమె రాలేని పరిస్థితిలో ఉండగా అంబులెన్స్‌లో జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. అంబులెన్స్‌లో ఉన్న రాజేశ్వరి వద్దకు మెజిస్ట్రేట్ బానోత్ రాజేశ్వర్ వెళ్లారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది సమక్షంలో ఫిర్యాది రాజేశ్వరి వాంగ్మూలాన్ని అంబులెన్సులోనే స్వీకరించారు. ఈ క్రమంలో ఫిర్యాది కొడుకు వెంకటేశ్వర్లుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం గమనార్హం.
ఎస్సీ, ఎస్టీ కేసులపై పోలీసుల నిర్లక్ష్యం తగదు
● కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్
కరీంనగర్‌టౌన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై బాధితులకు న్యాయం చేయడంలో కరీంనగర్ జిల్లా పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేశ్ విమర్శించారు. నగరంలోని మంకమ్మతోట జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 261 ఎస్సీ, ఎస్టీ, కేసులు నమోదైతే.. అందులో 154 కేసులు ఎఫ్‌ఐఆర్ దశలో ఉన్నాయన్నారు. 2024 నుంచి 2026 వరకు 12 కేసుల్లోనే చార్జిషీట్ నమోదు చేశారని, ఒక్క కేసులోనే శిక్ష పడిందన్నారు. 94 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కేసులు విచారణ సకాలంలో పూర్తిచేసి కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించడంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో 17 జూన్ 2024లో కేసు నమోదైతే.. ఇప్పటి వరకు చార్జిషీట్ దాఖలు చేయలేదన్నారు. డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారులతో 30 రోజుల్లో పూర్తివిచారణ చేయాలని చట్టం చెబుతున్నా.. పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసుల నిర్లక్ష్యంపై సామాజిక సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధితులు భూతం మల్లేశ్, కళ్లెం శివాజీ, టేకు నర్సింహులు, మిరియాల కృష్ణమూర్తి ఉన్నారు.
అంబులెన్స్‌లోనే కేసు విచారణ


