అన్నదాతల యాప్ సోపాలు!
జిల్లాలో ఎక్కడైనా యూరియా బుకింగ్ సౌకర్యం
స్థానికంగా లభించని ఎరువు
వేరేచోట లభించడంతో రైతులకు తప్పని దూరభారం
పట్టాలేని భూములకు యూరియా ఎలా అని ఆందోళన
10 నిమిషాల్లో బుకింగ్ క్లోజ్
శంకరపట్నం: యూరియా కోసం రైతుల తిప్పలు తప్పడం లేదు. శంకరపట్నం మండలం కన్నాపూర్, కొత్తగట్టు, తాడికల్ గోదాంలకు 840 యూరియా బస్తాలు గురువారం ఉదయం వచ్చాయి. రైతులు ఉదయం11:30 గంటలకు గోదాంలకు చేరుకున్నారు. సెల్‌ఫోన్‌లో యూరియా బుకింగ్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తుండగానే 10 నిమిషాల్లో కోటా పూర్త అయిందని చూపించడంతో బుకింగ్ నిలిచిపోయింది. దీంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. మండల కేంద్రంలోని ప్రైవేట్ ఎరువుల దుకాణం యజమాని బస్తా రూ.320కి విక్రయిస్తున్నాడని ఆరోపించారు.
కరీంనగర్ అర్బన్/కరీంనగర్‌రూరల్: ఫర్టిలైజర్ యాప్ అన్నదాతలను అపసోపాలకు గురిచేస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ బుకింగ్ విధానం ఆర్థికభారం పడేలా చేస్తోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న ఎరువుల విక్రయ కేంద్రాల్లోని స్టాక్ ఆధారంగా ఎక్కడినుంచైనా యాప్ లో ఎరువులను బుకింగ్ చేసుకునే సౌకర్యముండగా.. స్థానిక రైతులకు అవసరం సమయంలో అందని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులు ఎరువు లభించే ప్రాంతానికెళ్లి తెచ్చుకుంటున్నారు. రవాణాభారం పడుతోందని చెబుతున్నారు. కాగా.. రెవెన్యూ రికార్డుల్లో లేని భూములకు యూరియా ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఎక్కడైనా బుకింగ్ సౌకర్యం
గత నెల 31నుంచి జిల్లాలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను అమలు చేస్తున్నారు. పంట సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రైతులు బుకింగ్ చేసుకుని 48గంటల్లోపు ఎక్కడి నుంచైనా ఎరువు తీసుకోవచ్చు. తమ ప్రాంతంలో యూరియా దొరకని రైతులు లభించే చోటుకు వెళ్తున్నారు. కరీంనగర్ మండల పరిధిలోని దుర్శేడ్ సహకార సంఘం విక్రయ కేంద్రానికి మానకొండూరు, తీగలగుట్టపల్లి, నగునూరు, చొప్పదండి రైతులు వచ్చి యూరియా తీసుకెళ్తున్నారు. బస్తా ధర రూ.266 ఉండగా హమాలీ చార్జీతో రూ.270కి విక్రయిస్తున్నారు. రైతులు ట్రాక్టర్లు, ఆటోల్లో తరలించేందుకు బస్తాపై రూ.30 భారం పడుతోంది. ఏ మండల పరిధిలోని రైతులకు ఆ మండలంలోని విక్రయ కేంద్రాల్లో బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రికార్డులకెక్కని భూములకు యూరియా ఎట్లా?
భూ భారతిలో జిల్లాలో 29,426 దరఖాస్తులు వచ్చాయి. భూ వివరాలు సదరు రైతుల పేరు లేకపోగా.. మోకాపై ఉంటున్నా తప్పుగా వివరా లు నమోదవడం, ధరణిలో ఉన్నా భూ భారతిలో రాకపోవడం వంటి కారణాలతో వేల మంది రైతులు రికార్డుల్లో లేరు. సదరు దరఖాస్తులను పరిష్కరించాల్సిన రెవెన్యూశాఖ పట్టించుకోవడం లేదు. దీంతో యూరియా బస్తాలు ఎలా తీసుకోవాలి..? యాప్‌లో వారి వివరాలే లేనప్పుడు పంటలకు యూరియా ఎక్కడ నుంచి తేవాలన్నది అంతుచిక్కని ప్రశ్న. యూరియా వేస్తేనే పంటలకు ప్రయోజనం లేకుంటే పెట్టిన పెట్టుబడి, రైతన్న శ్రమ వృథాగా మారుతోంది. యుద్ధ ప్రతిపాదికన రికార్డులు సరిచేసేలా కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారిస్తేనే ప్రయోజనం ఉంటుందని రైతులు చెబుతున్నారు.
కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామానికి చెందిన కోట లచ్చయ్యకు వ్యవసాయమే జీవనాధారం. నలుగురు అన్నదమ్ములు కాగా తల్లిదండ్రులు మరణించారు. గ్రామంలోని 879, 1089, 1091, 1188, 1180 సర్వే నంబర్లలో నాలుగెకరాల భూమి ఉంది. గతంలో తండ్రి పేరున ఉండగా తల్లి పేరున మార్చాలని దరఖాస్తు చేయగా ప్రస్తుతం ఇతరుల పేరున సూచిస్తుంది. అలాంటప్పుడు లచ్చయ్య యూరియా బస్తాల కోసం యాప్‌లో బుక్ చేసే అవకాశం లేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో యూరియా బస్తాలకు దూరమయ్యాడు.


