ప్రచారం హద్దులు దాటొద్దు
కరీంనగర్ కార్పొరేషన్: కార్పొరేటర్ అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ప్రచారం చేసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సూచించారు. గురువారం నగరంలోని రెవెన్యూ గార్డెన్‌లో అభ్యర్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కండక్ట్‌ను ఉల్లంఘించకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలన్నారు. నగరంలోని 66 డివిజన్ల లో మొత్తం 477 పోలింగ్ కేంద్రాలున్నాయని, 11న జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల పేర్లను అభ్యర్థులు మూడు రోజుల మందుగా సంబంధిత ఆర్‌వోలకు అందజేయాలన్నారు. ప్రచార ర్యాలీలు, ప్రచార రథాల అనుమతులకు నగరపాలక సంస్థలో మరో రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కోడ్ సమయంలో పలు చోట్ల కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టారని తమ దృష్టికి వచ్చిందని, చర్యలు ఉంటాయన్నారు.ఎన్నికల పరిశీలకుడు జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్పించకుండా ప్రచారం చేయాలన్నారు. ప్రచార రథాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకే తిరగాలన్నారు. టౌన్ ఏసీపీ వెంకటరమణ, సీఐలు తిరుమల్, రాంచందర్‌రావు, సృజన్ రెడ్డి, నగరపాలకసంస్థ డీసీపీ బషీరొద్దీన్ పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌కు ప్రత్యేక కౌంటర్లు
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకొనే ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని నూతన రెవె న్యూ భవనంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు పరిశీలించారు. ఈ నెల 7, 8,9 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని ప్రత్యేక కౌంటర్‌లో ఓటు వేయాలన్నారు.


