నేను నిధులు తెస్తే.. వాళ్లు నీళ్లే ఇవ్వలేదు
కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్‌కు నిరంతరాయంగా నీళ్లు అందించేందుకు కేంద్రం నుంచి రూ.134 కోట్లు తీసుకొస్తే.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలకులు చుక్కనీరు ఇవ్వలేకపోయారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. డంప్‌యార్డ్ తరలింపునకు రూ.50 కోట్లు తెస్తే, యార్డును తరలించడంలో రాష్ట్ర పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. గురువారం నగరంలోని బొమ్మకల్, కృష్ణానగర్, గాంధీబొమ్మ, సీతారాంపూర్ హనుమాన్‌చౌరస్తాలో 6, 34, 54, 53, 65, 1, 23 డివిజన్ల అభ్యర్థులు మేకల వెంకటేశ్, ఎలగందుల నందకుమార్, గొట్టిముక్కల ఉమా వెంకటరమణ, కొంపెల్లి శ్వేత రమణ్ కుమార్, కమటం తిరుపతి, బారి అపర్ణ, పాదం శివరాజ్ తరఫున ప్రచారం నిర్వహించారు. బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కబ్జాలు చేసి జైలు పాలయ్యారని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే రెండేళ్లుగా కార్పొరేషన్‌కు నయాపైసా ఇవ్వడం లేదని విమర్శించారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వరదలా నిధులు తెస్తానని, కరీంనగర్‌కు నిరంతరాయంగా నీళ్లిస్తానని హామీ ఇచ్చారు. బొమ్మకల్‌లో కేంద్రం నిధులతో రాజీవ్ రహదారి పొడువునా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించానన్నారు. యజ్ఞవరాహస్వామి ఆలయం ప్రాంతం, కాపువాడ, కృష్ణానగర్ స్మార్ట్‌సిటీ నిధులతోనే అభివృద్ధి చెందాయన్నారు. గాంధీరోడ్డు, వైశ్య భవన్, రాజీవ్‌చౌక్, వీక్లీ మార్కెట్, నాఖాచౌరస్తా,అశోక్‌నగర్‌ను అభివృద్ధి చేశామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అశోక్‌నగర్, సాయినగర్, శర్మనగర్‌లో తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు.
నేను నిధులు తెస్తే.. వాళ్లు నీళ్లే ఇవ్వలేదు


