రెండో ర్యాండమైజేషన్ పూర్తి
కరీంనగర్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ విధానంలో రెండవ దశ సిబ్బంది కేటాయింపు పూర్తయింది. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఎన్నికల సాధారణ పరిశీలకుడు జి.జితేందర్ రెడ్డి సమక్షంలో ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ ప్రక్రియ అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మున్సిపల్ కమిషనర్, ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికలు జరిగే పట్టణాల్లో, నగరంలో బ్యాలెట్ బాక్సులు, విధులు నిర్వహించే సిబ్బంది, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది రవాణా ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్లో సౌకర్యాలపై సమీక్షించారు. ఆడిట్ అబ్జర్వర్ ఎం.మనోహర్ పాల్గొన్నారు.
నిబంధనల మేరకే ఎన్నికల ఖర్చు
చొప్పదండి: మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థులు నిబంధనల మేరకే ఖర్చు పెట్టాలని ఎలక్షన్ జనరల్ ఆబ్జర్వర్ జి.జితేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బుధవారం ఎన్నికల వ్యయం, నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అభ్యర్థులు పాటించాల్సిన సూచనల పుస్తకాలను అభ్యర్థులకు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ టి.మనోహర్, ఎక్పండేచర్ ఆబ్జర్వర్ ఎం.మనోహర్ పాల్గొన్నారు.


