బల్దియా బరిలో 398 మంది | - | Sakshi
Sakshi News home page

బల్దియా బరిలో 398 మంది

Feb 4 2026 7:26 AM | Updated on Feb 4 2026 7:26 AM

బల్దియా బరిలో 398 మంది

బల్దియా బరిలో 398 మంది

● 294 మంది ఉపసంహరణ ● గుర్తుల జాప్యంతో స్వతంత్రుల ఆందోళన

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్ని కల బరిలో 398మంది నిలిచారు. మంగళవారం ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. 698 నామినేషన్లకు గాను ఇప్పటికే ఆరుగురు నామినేషన్‌ను ఉపసంహరించుకోగా, చివరిరోజు మంగళవారం భారీ మొత్తంలో 294 మంది నామినేషన్లు ఉపసంహరించుకొన్నారు. 66 డివిజన్లకు గాను 398 మంది పోటీచేస్తున్నారు. బీజేపీ నుంచి 126, బీఎస్పీ నుంచి 2, కాంగ్రెస్‌ నుంచి 84, ఎంఐఎం నుంచి 9, బీఆర్‌ఎస్‌ నుంచి 48, ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి 2, సీపీఐ నుంచి ఒకరు, జేఎస్పీ నుంచి 2, స్వతంత్రులు 26 మంది ఉపసంహరించుకున్నారు.

బేరాలు...బీ–ఫారాలు

మంగళవారం నగరంలో ఉత్కంఠవాతావరణం నెలకొంది. ఓ వైపు పార్టీల బీ–ఫారాల కోసం...మరో వైపు పోటీలో ఉండే రెబల్స్‌, ఇతరులతో బేరసారాలు సాగించడంపై నాయకులు దృష్టిపెట్టారు. ఎంఐఎం మినహా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరపున బీ–ఫారాలు సమర్పించారు. కొన్ని చోట్ల అన్ని పార్టీల్లోనూ చివరిక్షణంలోనే అభ్యర్థులు ఖరారయ్యారు.

తప్పని రెబల్స్‌ బెడద

అన్ని ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికల్లో రెబెల్స్‌ బెడద తప్పడం లేదు. కాంగ్రెస్‌, బీజేపీల్లో కాస్త ఎక్కువగా ఉన్నారు. టికెట్‌లు ఇవ్వలేని వాళ్లను పార్టీ పెద్దలు బుజ్జగించారు. దీనితో కొంతమంది ఉపసంహరించుకున్నా, కొన్ని డివిజన్‌లలో బుజ్జగింపులకు రెబల్స్‌ లొంగలేదు. కాంగ్రెస్‌, బీజేపీ నుంచి టికెట్‌లు తమకే వస్తాయనుకొన్న మాజీ కార్పొరేటర్లు కొంతమందికి, టికెట్‌లు దక్కకపోవడంతో తప్పనిసరిగా స్వతంత్రులుగా బరిలో దిగారు.

సీపీఐకి ఒకటి

పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ మిత్రపక్షమైన సీపీఐకి ఒక సీటు కేటాయించింది. 57వ డివిజన్‌ సీపీఐ అభ్యర్థి లతాశ్రీ కసిరెడ్డికి మద్దతు ప్రకటించింది.

బల్దియా ముందు ఆందోళన

గుర్తుల కేటాయింపు, తుది జాబితా ప్రకటించడంలో జాప్యం చేస్తున్నారంటూ నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట స్వతంత్ర అభ్యర్థులు ధర్నాకు దిగారు. వాహనాలు, మైక్‌లకు అనుమతి తీసుకొనేందుకు ఒక్కకౌంటర్‌ ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

చొప్పదండి బరిలో 64 మంది

చొప్పదండి: నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చొప్పదండి మున్సిపాలిటీలోని 14 వార్డులలో 64 మంది బరిలోఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి అన్ని వార్డులలో అభ్యర్థులను బరిలోకి దింపారు. ఏఐఎఫ్‌బీ, జనసేన నుంచి 2 చొప్పున, బీఎస్పీ నుంచి ఒక్కరు, ఇండిపెండెంట్‌గా 17 మంది బరిలో ఉన్నారు. పట్టణంలో 14 వార్డులుండగా 2,6,7,11,12 వార్డుల్లో మూడు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 13,14 వార్డుల్లో నలుగురు చొప్పున, 3,4,10 వార్డుల్లో అయిదుగురు చొప్పున పోటీలో ఉన్నారు. 1,5,8 వార్డుల్లో ఆరుగురు చొప్పున, 9వ వార్డులో ఏకంగా 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement