సమన్వయంతో పనిచేయాలి
● జాతర కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● వేములవాడ జాతర నిర్వహణపై సమీక్ష
సిరిసిల్ల: మహాశివరాత్రి జాతరకు అన్ని శాఖల అధికారులు సమ్వయంతో పనిచేయాలని జాతర కమిటీ చైర్‌పర్సన్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఈనెల 14, 15, 16 తేదీల్లో మహాశివరాత్రి జాతర సందర్భంగా అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎస్పీ రుత్విక్‌సాయి, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ హాజరయ్యారు. కలెక్టర్ మా ట్లాడుతూ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం దాకా, వేములవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లలో మరమ్మతు, హెలిప్యాడ్ వద్ద, ఇతర చోట్ల బారికేడ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
జాతరకు 600 బస్సులు
భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ ఏడాది 600 బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఆర్‌ఎం తెలిపారు. జాతరకు ముందు నుంచి తర్వాత మూడు రోజుల వరకు పారిశుధ్య సేవలు అందించాలని సూచించారు. బస్టాండ్, పార్కింగ్ స్థలాలు, ఇతర చోట్ల హెల్ప్‌డెస్క్‌లు అందుబాటులో పెట్టాలని తెలిపారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, అల్పాహారం కల్పించాలని సూచించారు.
24 గంటలు విద్యుత్ సరఫరా
వేములవాడ పట్టణ వ్యాప్తంగా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సెస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భీమన్న ఆలయం, ప్రసాదం కౌంటర్, పార్కింగ్ స్థలాల్లో వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్‌లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. వేములవాడ ఏరియా హాస్పిటల్, సిరిసిల్ల జీజీహెచ్ వైద్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫుడ్‌సేఫ్టీ అధికారులు భక్తులకు అందించే ప్రసాదం, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించాలన్నారు.
నాంపల్లి వద్ద భక్తుల నియంత్రణ
నాంపల్లి వద్ద భక్తుల రద్దీ నియంత్రణకు ఇద్దరు అధికారులను నియమించాలని తెలిపారు. జాతరలో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా చూడాలని, క్యూలైన్ల వద్ద తాగునీటిని స్టీల్‌గ్లాస్‌లలో ఇవ్వాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల సహాయం కోసం వీల్‌చైర్లతో వలంటీర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
మహాశివరాత్రి సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. తిప్పాపూర్ బస్టాండ్‌తోపాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామికి ఏకాంత సేవలు, పూజలు కొనసాగుతాయని ఆలయ అర్చకుడు చంద్రగిరి శరత్ తెలిపారు. భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి జాతర, స్వామి వారికి పట్టువస్త్రాల సమర్పణ టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తారని వెల్లడించారు. ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవోలు రాధాబాయి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


