లంకెబిందెలంటూ భయపెట్టి.. | - | Sakshi
Sakshi News home page

లంకెబిందెలంటూ భయపెట్టి..

Feb 3 2026 7:45 AM | Updated on Feb 3 2026 7:45 AM

లంకెబ

లంకెబిందెలంటూ భయపెట్టి..

కామారెడ్డి క్రైం: ‘మీ ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయి. అందుకే మీకు తరచూ అనారోగ్య, ఇతర సమస్యలు వస్తున్నాయి. వాటిని తీసివేయకపోతే మీ కుటుంబంలో మరణాలు తప్పవు’ అంటూ భయపెడుతూ.. క్షుద్ర పూజల పేరుతో లక్షలు దోచుకుంటున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేటకు చెందిన దుమ్మల్ల బీరవ్వ ఇంటికి కొద్దిరోజుల క్రితం వాస్తు పరిజ్ఞానం, అతీంద్రియ శక్తులు ఉన్నట్లు నటిస్తూ ఓ వ్యక్తి వచ్చాడు. మీ ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయని, వాటి కారణంగానే కుటుంబంలో అనారోగ్య సమస్యలు, అశాంతి పెరుగుతోందని చెప్పాడు. వాటిని తీయకపోతే ప్రాణాలకు ముప్పు ఉంటుందని భయపెట్టాడు. క్షుద్రపూజలు చేసి లంకెబిందెలు తీసివేస్తానని నమ్మించాడు. దీనికి రూ.8.20 లక్షలు డిమాండ్‌ చేశాడు. భీరవ్వ కుటుంబం ఇటీవల సదరు వ్యక్తికి కామారెడ్డిలో డబ్బులు అందించింది. తర్వాత అతడు ఫోన్‌ ఎత్తకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి గతనెల 26న కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడిని రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన కడమంచి నర్సింలు అలియాస్‌ నర్సారెడ్డిగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి రూ.7లక్షలు నగదు, సెల్‌ఫోన్‌, రెండు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అతడి ఇద్దరు అనుచరులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

గతంలోనూ పలు కేసులు..

ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని గుప్తనిధులు, పూజల పేరిట ఈ ముఠా చాలా మంది నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతేడాది కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన లాస్య అనే మహిళ ఇంటికి భిక్షాటన కోసం వెళ్లి లంకెబిందెల పేరిట ఇదే తరహాలో రూ.14 లక్షలు డిమాండ్‌ చేశారు. ఆమె నుంచి రూ.2.93 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటనలో కేసు నమోదైంది. ఇలా ఇతర జిల్లాల్లోనూ ఈ ముఠాపై పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనకు కృషి చేసిన సీఐ నరహరి, సిబ్బందిని అభినందించారు.

క్షుద్రపూజల పేరిట లక్షల దోపిడీ

నిందితుడి అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్‌చంద్ర

లంకెబిందెలంటూ భయపెట్టి..1
1/1

లంకెబిందెలంటూ భయపెట్టి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement