తల్లిదండ్రుల పెళ్లిరోజే కుమారుడి మృతి
● యువకుడిని కబళించిన రోడ్డు ప్రమాదం
● చిట్టాపూర్‌లో విషాదం
మల్లాపూర్: తల్లిదండ్రుల పెళ్లిరోజే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మండలంలోని సాతారం, ధర్మారం గ్రామాల మధ్య సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని చిట్టాపూర్‌కు చెందిన బొమ్మెన రమేశ్, లత దంపతులకు ఇద్దరు కుమారులు. రమేశ్ బ్రాస్‌బ్యాండ్ నిర్వహిస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెద్దకుమారుడు యశ్వంత్(20) ఇంటర్ పూర్తి చేసి తండ్రికి చెదోడువాదోడుగా ఉంటున్నాడు. రమేశ్, లత పెళ్లిరోజు కావడంతో కుటుంబసభ్యులంతా ఆనందంగా గడిపారు. రాత్రి 7.30గంటల సమయంలో యశ్వంత్ బైక్‌పై సాతారం గ్రామంలోని మిత్రుల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సాతారం–ధర్మారం గ్రామాల మధ్య గుండంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. మల్లాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
తల్లిదండ్రుల పెళ్లిరోజే కుమారుడి మృతి


