అమ్మో ఆ వార్డు..!
● ‘మీ కుల సంఘానికి ఫంక్షన్ హాల్ ఉంది.. దాన్ని ఏసీ ఫంక్షన్ హాల్‌గా మార్చడానికి అవసరమైన డబ్బులు నేనే ఖర్చు పెడతా.. మీ ఓట్లన్నీ గుల్లగుత్తగా నాకే వేయాలి’.
● ‘నా వార్డులో మీదే పెద్ద కుల సంఘం.. మీ సంఘానికి స్థలం కొనివ్వడంతోపాటు మరో రూ.10 లక్షలు ఇచ్చి భవన నిర్మాణానికి సహాకరిస్తా..మీ ఓట్టు పొల్లుపోకుండా వేయండి.’
● ‘నా వార్డులో ఉన్న ఓటర్లు ఎవరు ఎదుటి వారి వైపు చూడాల్సిన అవసరమే ఉండొద్దు. ఏం కావాలన్నా.. ఎంత ఖరీదైనా నన్నే అడగండి. నేను సమకూరుస్తా..’
కోరుట్ల: ఇదీ.. కోరుట్ల మున్సిపాలిటీలోని ఓ వార్డు తీరు. ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అంతే కాదు.. ఇతర వార్డుల్లో పోటీ చేస్తున్న వారికి తలనొప్పిగా మారింది. సదరు వార్డులో పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి చైర్‌పర్సన్ స్థానం కోసం పోటీ పడుతున్నాడు. గతంలోనూ చైర్‌పర్సన్ హోదాలో కొనసాగారు. ఈసారి తాను పోటీ చేస్తున్న వార్డులో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న లక్ష్యంతో నెల రోజుల ముందు నుంచే ఓటర్లకు తాయిలాలు పంపిణీ మొదలు పెట్టారు. ఇప్పటికే ఆ వార్డులోని ఓటర్లకు రెండు, మూడుసార్లు మందు, మాంసం విందులు జోరుగా సాగాయి. ఇప్పటికీ అదే తీరు. వార్డులోని ఓటర్లు ఏం అడిగినా సరే కాదనకుండా సదరు అభ్యర్థి వ్యవహరిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వార్డులో జరిగిన ఖర్చు జిల్లాలో ఎక్కడా జరగదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్డులో ఇతర పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు సదరు అభ్యర్థితో పోటీ పడేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు ముగిసేసరికి ఆ వార్డులో అనధికారికంగా ఎంత తక్కువ అనుకున్నా రూ. కోటి వరకు ఖర్చవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఓటర్లు మాత్రం అదృష్టవంతులని ఇతర వార్డుల్లోని ఓటర్లు చెవులు కొరుక్కుంటున్నారు.
అడిగిన వారికి లేదనకుండా..
ఇప్పటికే రూ.లక్షల్లో ఖర్చు
అమ్మో ఆ వార్డు..!


