కుక్కల దాడిలో జీవాలు మృతి
వేములవాడరూరల్: ఉన్న ఊర్లో మేపలేక పొరుగు గ్రామాలకు వచ్చిన పశువుల కాపరులకు కష్టాలు తప్పడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామ శివారులో 3 రోజులుగా ముక్కిన బియ్యం తిని గొర్రెలు మృతిచెందిన సంఘటనలున్నాయి. అదే ప్రాంతంలో మరో గొర్రెల కాపరుల మందపై కుక్కలు దాడి చేసి దాదాపు 30 గొర్రెలు, మేకలను చంపిన సంఘటన ఆదివారం జరిగింది. వారి వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం గ్రామానికి చెందిన భూపతి కొండమల్లయ్య, భూపతి దేవయ్య, భూపతి నడిపి అంజయ్య, రేపాక దేవరాజు, రేపాక గంగారెడ్డి, ఇరువేని గంగాధర్, ఇరువేని కొమురెల్లి అనే పశువుల కాపరులు 20 రోజుల క్రితం ఈ ప్రాంతానికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం చిన్న పిల్లలను ఒక పంట చేన్లో జాలీలో పెట్టి పక్కనే పశువులను కాస్తుండగా.. అకస్మాత్తుగా అక్కడికొచ్చిన కుక్కలు జాలీలో ఉన్న గొర్రెలు, మేకలపై దాడి చేశాయి. దాదాపు 30 వరకు పశువులు అక్కడికక్కడే మృతిచెందాయి. వెంటనే వచ్చి వాటిని తరమగా.. కొన్ని పశువులు ప్రాణాలతో బయటపడ్డాయి. ఇదే ప్రాంతంలో కథలాపూర్ మండలానికి చెందిన కొంతమంది పశువుల కాపరులు పశువులను తోల్కొని రాగా.. రైస్‌మిల్ పక్కనున్న ముక్కిన బియ్యం తిని దాదాపు 80 పశువుల వరకు మృతిచెందాయి. మేత కోసం తీసుకొస్తే మృత్యువాత పడడంతో పశువుల కాపరులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
నిన్న ముక్కిన బియ్యంతో.. నేడు శునకాల దాడిలో..
నష్టాల్లో పశువుల కాపరులు
ఆదుకోవాలని వేడుకోలు


