మానేరు వాగులో పడి వ్యక్తి మృతి
సిరిసిల్ల క్రైం/తంగళ్లపల్లి: సిరిసిల్ల మానేరు వాగులో ఆదివారం ఓ వ్యక్తి పడి మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన గండికోట మహేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. మానేరు తీరంలోని వినాయక నిమజ్జనం ప్రదేశానికి, వినాయక విగ్రహాల ఇనుప రాడ్లను సేకరించేందుకు అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తితో కలిసి ఆదివారం వెళ్లాడు. ఇనుము సేకరిస్తున్న క్రమంలో మహేశ్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో.. కాలు రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయి నీటిలో మునిగి మృతిచెందాడు. రవికి మహేశ్ కనిపించకపోవడంతో గాలించగా.. మృతదేహం నీటిలో కనిపించడంతో స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేర్చారు. మృతుడికి భార్య సుజాత, సంతానం శివ, శివాని ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానకొండూర్: శంశాబాద్ గ్రామానికి చెందిన గడ్డి రవి(43) అనే రైతు ఆదివారం ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ ఉప కాలువలో పడి మృతిచెందాడు. రవి తన వ్యవసాయ పొలం వద్దకు ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా.. ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ ఉప కాలువలో పడిపోయింది. వాహనంపై ఉన్న రవి కూడా కాలువలో పడగా.. ముక్కుకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు కూలీలు మృతి
కరీంనగర్ క్రైం: టవర్ సర్కిల్లో లేబర్ అడ్డా వద్ద ఇద్దరు కూలీలు అనారోగ్యంతో కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. కాశ్మీర్ గడ్డకు చెందిన మహంకాళి కృష్ణ(50), హుస్సేన్‌పురకు చెందిన మహమ్మద్ అజీమ్(40) ప్రతిరోజు కూలి పనికి టవర్ సర్కిల్లో ఉన్న లేబర్ అడ్డా వద్దకు వస్తారు. వేర్వేరు సమయాల్లో కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇద్దరికీ రోజు మద్యం తాగే అలవాటుంది. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు సూచించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానేరు వాగులో పడి వ్యక్తి మృతి


