ఆశాజనకంగా పసుపు ధరలు
జగిత్యాలఅగ్రికల్చర్: గతంతో పోల్చితే ఈ ఏడాది పసుపు ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు త్వరగా పంటను మార్కెట్‌కు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో జగిత్యాల జిల్లాలోని ప్రతీ గ్రామంలో పసుపు రైతులు పంట ఆకు కోయడం, పసుపు గడ్డలు తవ్వడం, ఉడుకబెట్టడం, ఆరబెట్టడంలో బిజీగా ఉన్నారు. రైతులందరూ పంటను ఒకేసారి మార్కెట్‌కు తీసుకవస్తే, వ్యాపారులు రేట్లు తగ్గిస్తారనే ఆలోచనలతో, ఎప్పటికప్పుడు వెంటనే మార్కెట్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
నిజమాబాద్, మెట్‌పల్లి మార్కెట్లకు..
రైతులు పసుపు పంటను నిజమాబాద్, మెట్‌పల్లి, జగిత్యాల మార్కెట్లకు తరలిస్తుంటారు. అయితే, కొన్నేళ్లుగా పంటకు ఓపెన్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.6–7 వేల ధర మాత్రమే పలుకగా, ఈసారి రూ.13 వేల వరకు పలుకుతూ రైతన్నకు ఆశానజకంగా మారాయి. దీంతో వచ్చే ఏడాది మరింత పసుపు సాగు చేసేందుకు ప్రస్తుతం పండిన పంట నుంచి నాణ్యమైన విత్తనాన్ని సేకరిస్తున్నారు. ఎకరం, రెండెకరాల్లో పంట వేసేవారు కనీసం 2 ట్రాక్టర్ల విత్తనాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం పసుపు తవ్వే సమయం కాబట్టి విత్తనం దొరుకుతుంది. తర్వాత దొరికే అవకాశం ఉండదు.
6–7 లక్షల క్వింటాళ్లు..
జగిత్యాల జిల్లాలో దాదాపు 20 వేల ఎకరాల్లో పసుపు సాగవుతోంది. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముంది. జిల్లావ్యాప్తంగా దాదాపు 6–7 లక్షల క్వింటాళ్ల పంట ఉత్పత్తి అవుతుంది. అయితే, ఈ ఏడాది వర్షాలతో కొన్ని మండలాల్లో తెగుళ్లు, పురుగులతో దిగుబడులు తగ్గాయి. అలాగే కొన్నేళ్లుగా రేటు లేక రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గిస్తూ వచ్చారు. ఈసారి అనూహ్య పరిస్థితుల్లో ఓపెన్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.13 వేల మార్క్ దాటడంతో రైతులు హర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మరింత విస్తీర్ణంలో పంట సాగు చేసేందుకు ఇప్పటి నుంచి భూములను సిద్ధం చేసుకుంటున్నారు.
పెరుగుతున్న పెట్టుబడి
పసుపు పంట దాదాపు 9–10 నెలల పాటు భూమిలో ఉంటోంది. పంటకాలంలో అన్ని ఖర్చులు కలుపుకుంటే ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది. పంటకు ఒక్కో ఎకరాకు కనీసం లారీ కోడి ఎరువు వేస్తుంటారు. దాని ధర రూ.25 వేల వరకు ఉంది. పంట తవ్వేందుకు కూలీల ఖర్చు ఎకరాకు రూ.25 వేలు, ఉడుకబెట్టి, ఆరబెట్టి, మార్కెట్‌కు తరలించేందుకు రూ.10 వేల వరకు ఖర్చు వస్తుంది. దీంతో పాటు ఎరువులు, విత్తనం, ట్రాక్టర్‌తో దున్నేందుకు, కలుపు ఖర్చు ఇలా.. మరో రూ.20 వేల ఖర్చు అవుతుంది. పంటకు పెడుతున్న ఖర్చులకు రెట్టింపు ఆదాయం రావాలని రైతులు భావిస్తున్నారు.
పంటను తవ్వి, ఉడుకబెట్టి మార్కెట్‌కు తరలిస్తున్న రైతులు
ప్రస్తుతం క్వింటాల్‌కు రూ 13 వేల పైనే..
ఆశాజనకంగా పసుపు ధరలు


