తల్లీకుమారుల వైద్యానికి రూ.1.25లక్షల విరాళం
● సామాజిక మిత్రుల దాతృత్వం
ధర్మపురి: ఒకవైపు తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఇటీవల ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్నాడు. ధీనస్థితిలో ఉన్న బాధిత కుటుంబానికి సామాజిక మిత్రులు స్పందించి రూ.1.25 లక్షలు విరాళాలుగా అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ధర్మపురి పట్టణంలోని ముదిరాజ్‌వాడకు చెందిన రేగుల రాజన్న, పద్మ దంపతులు. రాజన్న అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితమే మరణించాడు. బీడీలు చుడుతూ జీవనం కొనసాగిస్తున్న పద్మ ఐదేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడింది. ఆమె కుమారుడు రాజేందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇరువురి వైద్యం కోసం అప్పు చేశారు. ఆ అప్పు తీర్చేందుకు తమకున్న స్థలాన్ని విక్రయించడానికి సిద్ధమయ్యారు. వీరి ధీనస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ బాధిత కుటుంబానికి సాయం అందించాలని జనవరి 3న ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. స్పందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు, కర్ణాటకకు చెందిన బళ్లారి మిత్రులు, ఇతర దాతలు పద్మ బ్యాంకు ఖాతాకు రూ.1.25లక్షలు విరాళాలుగా పంపించారు. వాటిని రమేష్ స్థానిక యూనియన్ బ్యాంకు మేనేజర్ మాధవరావు చేతుల మీదుగా పద్మకు అందించారు. సాయం అందించిన దాతలకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మహిళపై అత్యాచారయత్నం
ముత్తారం(మంథని): మండలంలోని ఓ గ్రామంలో గతనెల 29న ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళకు బంధువైన ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న వస్తువు తీసి ఇవ్వాలని అడిగాడు. ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే తలుపులు పెట్టి అత్యాచారం చేయబోయాడు. మహిళ తప్పించుకొని అరుస్తూ బయటకు పరుగులు పెట్టింది. కాగా, ఈ విషయం బయటకు పొక్కకుండా కొందరు నాయకులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. చివరకు మహిళ ఠాణా మెట్లు ఎక్కింది. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఈ ఘటనపై ఎస్సై రవికుమార్‌ను వివరణ కోరగా.. అత్యాచారయత్నం తమ దృష్టికి వచ్చిందని, కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇలాంటి విషయాలు బయట పెట్టరాదని తెలిపారు.


