అగ్నిప్రమాదంలో సామగ్రి దగ్ధం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని పెగడపల్లిలో గోపగోని మల్లీశ్వరిస్వామి ఇంట్లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా బాధితులు వేరే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. నిర్మాణ పనుల్లో పాల్గొనేందుకు వెళ్లగా, అద్దె ఇంట్లో మంటలంటుకుని సామగ్రి, నిత్యవసర వస్తువులు దగ్ధమయ్యాయి. ఇంటి ఓనర్ సామగ్రి సైతం ప్రమాదంలో కాలిపోయాయి. సుమారు రూ.3లక్షల నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మోసం చేసిన వారిపై కేసు నమోదు
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని అంగడిబజార్‌కు చెందిన కట్కం చంద్రశేఖర్‌తోపాటు, మరికొంత మందితో యుబిట్ ఆన్‌లైన్ క్రిప్టోలో పెట్టుబడులు పెట్టించి మోసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మాయమాటలు చెప్పి చంద్రశేఖర్ వద్ద రూ.40 లక్షలు, మరికొందరితో అదే పట్టణానికి చెందిన వేముల మల్లికార్జున్, పిల్లి కిషన్, శివగంగ అధిక వడ్డీ ఇస్తామని ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టించారు. కొద్దిరోజుల క్రితం సదరు యాప్ మూతపడటంతో డబ్బులు చెల్లించాలని చంద్రశేఖర్ కోరుతున్నా సదరు వ్యక్తులు పట్టించుకోవడం లేదు. బాధితుని ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
37 మంది పిల్లల గుర్తింపు
● ముగిసిన ఆపరేషన్ స్మైల్
● చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు శివకుమార్
జగిత్యాల: ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా జిల్లాలో 33 మంది బాలురు, నలుగురు ఆడపిల్లలను గుర్తించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కోటగిరి శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా జనవరిలో సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ, లేబర్ డిపార్ట్‌మెంట్, పోలీసు శాఖ సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపర్చామన్నారు. పలువురు యజమానులపై కేసులు నమోదు చేశామన్నారు.


