స్వగ్రామం చేరిన మృతదేహం
కథలాపూర్(వేములవాడ): మండలంలోని సిరి కొండకు చెందిన ముంజ స్కైలాబ్ గౌడ్(45) దుబాయిలో గుండెపోటుతో మృతిచెందగా మృతదేహం శుక్రవారం ఇంటికి చేరింది. స్కైలాబ్ గౌడ్ పదేళ్లుగా దుబాయిలోని అబుదాబి ఏరియాలో ముజాయిదా క్యాంపులో కార్మికుడిగా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి దుబాయి వెళ్లారు. ఈ నెల 26న తాను ఉంటున్న క్యాంపులోనే గుండెపోటు రావడంతో తోటి మిత్రులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ మృతిచెందారు. మృతుడికి భార్య యమున, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతదేహం ఇంటికి చేరడంతో కుటుంబసభ్యుల, బంధువుల రోదనలు మిన్నంటాయి. బాధితకుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.


